భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయాన్ని 24 గం.లు గడవకముందే పాకిస్థాన్ ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో ఎలాంటి వాణిజ్య సంబంధాలు చేపట్టబోమని ఆయన స్పష్టంచేశారు. కీలక మంత్రులతో సంప్రదింపుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు శనివారం వెల్లడించాయి.
పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత్ నుంచి ఆ దేశంలోకి ఇప్పట్లో షుగర్, కాటన్ దిగుమతులు ఉండబోవని తేలిపోయింది. ప్రస్తుతం పాక్‌లో షుగర్ కొరత నెలకొనడంతో దాని ధరలు గణనీయంగా పెరిగాయి. అలాగే ఇతర వస్తువుల ధరలు కూడా మండిపోతున్నాయి. డిపాండ్-సప్లై మధ్య సమతౌల్యత తీసుకొచ్చేందుకు విదేశాల నుంచి తక్కువ ధరకు ఆ వస్తువులను దిగుమతి చేసుకోవడంపై దృష్టిసారించాలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులను ఇమ్రాన్ ఖాన్ ఆదేశించినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ సిఫార్సులపై చర్చించిన తర్వాత పాక్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
భారత్ నుంచి దిగుమతులను నిరాకరించడంతో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ధరాఘాతంతో పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించడం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.
ఇది కూడా చదవండి..US Capitol: యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద మళ్లీ అలజడి.. బారికేడ్లపై దూసుకెళ్లిన కారు.. ఓ అధికారి మృతి
Mrbeast Coffin Video: 50 గంటల పాటు సజీవ సమాధి.. యూట్యూబర్ స్టంట్.. చివరకు ఏమైందంటే..?