నేపాల్‌ పార్లమెంటు రద్దుకు రాష్ట్రపతి ఆమోదం.. మధ్యంతర ఎన్నికల షెడ్యూల్ విడుదల

|

Dec 20, 2020 | 8:13 PM

నేపాల్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌ధాని కేపీ శ‌ర్మ పార్ల‌మెంట్ ర‌ద్దు సిఫార‌సును ఆ దేశ రాష్ట్ర‌ప‌తి బిద్యాదేవి బండారీ వెంట‌నే ఆమోదించారు.

నేపాల్‌ పార్లమెంటు రద్దుకు రాష్ట్రపతి ఆమోదం.. మధ్యంతర ఎన్నికల షెడ్యూల్ విడుదల
Follow us on

నేపాల్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌ధాని కేపీ శ‌ర్మ పార్ల‌మెంట్ ర‌ద్దు సిఫార‌సును ఆ దేశ రాష్ట్ర‌ప‌తి బిద్యాదేవి బండారీ వెంట‌నే ఆమోదించారు. కేపీ శ‌ర్మ అటు త‌ర్వాత ఆ దేశ ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. పార్ల‌మెంట్ ర‌ద్దుపై అధికారిక ప్ర‌క‌ట‌న రాగానే.. ఎన్నిక‌ల క‌మిష‌న్ జాతీయ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించింది. 2021 ఏప్రిల్‌ 30న తొలి దశ, మే 10న రెండో దశ పోలింగ్ జ‌రిపేందుకు నిర్ణ‌యించింది. కాగా కేపీ శర్మ ప్రభుత్వ తీరుపట్ల ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ప్రధాని కెపి. శర్మ ఓలీ నేతృత్వంలో సమావేశమైన నేపాల్ కేంద్ర మంత్రిమండలి, పార్లమెంటును రద్దుచేయాలంటూ మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఇవాళ ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రిమండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ స‌మ‌యంలో కీల‌కమైన నియామ‌కాలు చేసే అధికారాన్ని కేపీ శ‌ర్మ త‌న‌కే క‌ట్ట‌బెట్టుకుంటూ ఇటీవ‌ల ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనిపై ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వచ్చింది. వారి శాంతింపజేసేందుక శ‌ర్మ తీవ్రంగానే ప్ర‌య‌త్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో చివరకు పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర‌ప‌తి ఆమోదంతో.. అలా నేపాల్‌లో జాతీయ ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి.

కాగా, “పార్లమెంటరీ పార్టీ, సెంట్రల్ కమిటీ, పార్టీ సచివాలయంలో ప్రధానమంత్రి తన మెజారిటీ కోల్పోయారు. పార్టీలో ప్రస్తుతం తలెత్తిన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించకుండా పార్లమెంట్‌ను రద్దు చెయ్యాలని పీఎం నిర్ణయం తీసుకున్నారు” అని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు బిష్ణు రిజాల్ అన్నారు.