Monkeypox: మంకీపాక్స్.. ఈ పేరు ఇటీవల నుంచి తెరపైకి వచ్చింది. కరోనా వైరస్‌లాగా ఇప్పుడు మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. భారత్‌లో కూడా ఈ మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ మంకీపాక్స్ పేరును మార్చడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశీలిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధికి మరో పేరును సూచించమని డబ్ల్యూహెచ్‌వో ప్రజలను కోరింది. ఐక్యరాజ్యసమితి (UN) ఆరోగ్య సంస్థ మే నుండి ప్రపంచవ్యాప్తంగా ఉద్భవించిన వ్యాధి పేరును మార్చాలని వారాలుగా ఆందోళన చేస్తోంది. విశేషమేమిటంటే ఈ వ్యాధి పేరు కోతులతో ముడిపడి ఉండటంతో, ఇటీవల వాటిపై దాడుల కేసులు తెరపైకి రావడంతో పేరు మార్పు చేయాలనే ఆలోచన వచ్చింది.
మంకీపాక్స్ వ్యాధి పేరుతో కోతులపై దాడులు..
మంకీపాక్స్ అనే పేరు వల్ల మనుషులను పోలిన జంతువుల వంశం పేరు చెడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తిలో కోతుల పాత్ర తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికా ఖండంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి జంతువులను బాధ్యులను చేశారు. ఉదాహరణకు, ఇటీవల బ్రెజిల్‌లో వ్యాధి భయంతో ప్రజలు కోతులపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి.
Monkeypox కొత్త పేరు కోసం వెబ్‌సైట్
WHO ప్రతినిధి ఫడేలా చైబ్ జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ.. మంకీపాక్స్ పేరు ఉండటం వల్ల కోతులపై దాడులు జరుగుతున్నాయి. మేము వేరే పేరును పరిశీలించాలని భావిస్తున్నాము. కొత్త పేరును సూచించడానికి ఇప్పుడు ఒక ప్రత్యేక వెబ్‌సైట్ సృష్టించబడింది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది అని ఆమె తెలిపారు.
మంకీపాక్స్ పేరు పెట్టడానికి కారణం ఈ వైరస్ కోతుల ద్వారా రావడమే. ముందుగా ఈ వైరస్‌ను కోతుల్లోనే గుర్తించారు పరిశోధకులు. అయితే ఈ వ్యాధి అనేక ఇతర జంతువులలో కూడా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఎలుకలలో కూడా వస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ వ్యాధి మొదటిసారిగా 1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మానవులలో వ్యాపించింది. అప్పటి నుండి ఈ వ్యాధి ముఖ్యంగా కొన్ని పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా వ్యాపించింది.
రోమన్ సంఖ్యలపై పరిశీలన
మంకీపాక్స్ వైరస్ వైవిధ్యాలు లేదా క్లాడ్‌ల కోసం నిపుణుల బృందం ఇప్పటికే కొత్త పేర్లను అంగీకరించిందని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ గత వారం ప్రకటించింది. ఇప్పటి వరకు భౌగోళిక ప్రాంతాల పేరుతో రెండు ప్రత్యేక పేర్లను పెట్టారు. ఈ ప్రాంతాలలో కాంగో బేసిన్, పశ్చిమ ఆఫ్రికా ఉన్నాయి. అయితే నిపుణులు మంకీపాక్స్ వైరస్ కోసం కొత్త పేరు కోసం రోమన్ సంఖ్యలను ఉపయోగించడానికి అంగీకరించారు. వీటికి క్లాడ్ I, క్లాడ్ II అని పేరు పెట్టారు. క్లాడ్ II సబ్‌వేరియంట్, ఇప్పుడు క్లాడ్ IIb అని పిలుస్తారు.
మే నుండి ప్రపంచంలో మంకీపాక్స్ వ్యాప్తి
మే నెలలో మంకీపాక్స్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభించింది. ఈ వ్యాధి ఉన్న రోగులలో జ్వరం, కండరాల నొప్పి, చర్మంపై పెద్ద పెద్ద దద్దుర్లు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇది స్వలింగ సంపర్కుల మధ్య ఎక్కువగా వ్యాపించిందని నిపుణులు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం వారి మధ్య ఉన్న లైంగిక సంబంధాలే. సంవత్సరం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 31,000 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నిర్ధారించబడ్డాయి. WHO ప్రకారం.. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 12 మంది మరణించారు. WHO ఈ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడానికి కారణం ఇదే. మంకీపాక్స్ వైరస్ జంతువుల నుండి మనుషులకు సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ, ఈ వ్యాధి ఇటీవలి ప్రపంచవ్యాప్త వ్యాప్తికి మానవుని నుండి మానవునికి సన్నిహిత సంబంధం కారణంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో నిపుణులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి