ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్(Monkeypox) కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వైరస్ కేసులతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ మంకీపాక్స్ వైరస్ నిర్ధరణ కాగా తాజాగా మెక్సికో(Mexico), ఐర్లాండ్(Ireland) దేశాల్లోనూ తొలి కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అంతే కాకుండా ఐర్లాండ్‌లోనూ మంకీపాక్స్ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే మంకీపాక్స్‌కు అంతలా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ అనేది కరోనా తరహాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కాదని, మశూచి మాదిరే మంకీపాక్స్ కూడా ఆ కుటుంబానికి చెందినదేనని అంటున్నారు.
మరోవైపు.. పలు దేశాల్లో మంకీపాక్స్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు ప్రారంభించారు. ఇండియాకు చెందిన మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్(Trivitron) హెల్త్‌కేర్.. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌టైమ్ పీసీఆర్ కిట్‌ను రూపొందించింది. ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్. ఇది వన్ ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో పని చేస్తుంది. తద్వారా గంటలోపే ఫలితం తెలుసుకోవచ్చని ట్రివిట్రాన్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ట్రివిట్రాన్ హెచ్చరించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్ వైరస్ కరోనా అంత ప్రమాదకారి కాదని వెల్లడించింది. ఈ వైరస్ ను నివారించేందుకు అవసరమైన టీకాలు ఏయే దేశాల వద్ద ఎన్ని ఉన్నాయో పూర్తి సమాచారం లేదని తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి