ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై వచ్చినన్ని కథనాలు ఈ మధ్యన మరెవ్వరి మీద రాలేదు.. ఆయనో నియంత అని, ఆ దేశంలో ఆయన చెప్పిందే వేదమని, అందరూ పాటించి తీరాల్సిందేనని.. ఇలా బోలెడన్ని వార్తలు వచ్చాయి.. ఆ మధ్యన అమెరికా కంట్లో కూడా నలుసైన కిమ్ నిజంగానే ధైర్యవంతుడేనా? ఎవరినీ లెక్క చేయడా? అంటే కిమ్‌కు అంత సీన్ లేదని అంటున్నాయి దక్షిణ కొరియా నిఘా సంస్థలు.. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ అంటే గజగజమని వణికిపోతున్నాడట! ఎక్కడ అంటుకుంటుందోనన్న భయంతో బిక్కచచ్చిపోతున్నాడట! ఆ భయంతోనే అక్కడి అధికారులను నానా రకాలుగా హింసపెడుతున్నారట! కరోనాను నియంత్రించకపోతే కఠినచర్యలు తీసుకుంటున్నాడు కిమ్.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, నిర్లిప్తతతో ఉన్నా మరణదండన విధిస్తున్నాడని దక్షిణ కొరియా అంటోంది.. మొన్నామధ్య విధులలో కాసింత ఏమరుపాటుగా ఉన్న ఓ ఇద్దరు అధికారులకు మరణశిక్ష విధించినట్టు దక్షిణ కొరియా నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఎవరైనా సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించినా, దేశాన్ని విడిచిపెట్టి వెళుతున్నా వారిని వెంటనే కాల్చివేయాలని ఆదేశించారట కిమ్. ఇప్పుడు దేశంలో ఉన్న విదేశీలందరినీ క్వారంటైన్‌కు తరలించారు అక్కడి అధికారులు. ఇక దౌత్యవేత్తలు, రాయబారులు ఇంటి నుంచి బయటకు రాకూడదని హెచ్చరించాడు. కిమ్ ఆదేశాల మేరకు సరిహద్దులలో నిఘా పెంచారు అధికారులు. దిగుమతులను పూర్తిగా బంద్ చేశారు.. ఉత్తరకొరియాలో కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే కరోనా వైరస్ తెలిసిన తొలినాళ్లలోనే ఆ దేశంలో సరిహద్దులను మూసేశారు. ప్రయాణాలను నిషేధించారు. చైనా నుంచి ఓ వ్యక్తి కేసాంగ్ అనే నగరానికి వచ్చాడన్న అనుమానంతో ఆ నగరం మొత్తాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇందుకు కారణం అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు.. ఎవరికైనా కరోనా సోకితే కోలుకోవడం కష్టం.. కొన్ని చోట్ల ఫస్ట్ ఎయిడ్‌కు అవసరమైన మందులు కూడా లేవు.. ఉన్న కొద్దిపాటి హాస్పిటల్స్‌లో అవినీతి రాజ్యమేలుతుంటుంది.. వైద్య వ్యవస్థ ఇంతగా భ్రష్టు పట్టిన ఆ దేశంలో కరోనా వస్తే ఎలా ఉంటుందో కిమ్‌కు తెలియనిది కాదు.. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.. భయాందోళనలతో వణికిపోతున్నాడు. అదలా ఉంటే, కరోనా భయానికే దిగుమతులన్నింటినీ ఆపేశారు. ఫలితంగా దేశంలో ఆహారపదార్థాల కొరత ఏర్పడింది.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలిచావులు తప్పవంటున్నారు మేథావులు.