
ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ..? ఇప్పుడిదే ప్రశ్న అంతర్జాతీయ సమాజం నుంచి వినిపిస్తోంది. ఖమేనీ అంతమే తమ పంతమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌నుంచి ఖమేనిని ఎలిమినేట్ చేయడమే తమ టార్గెట్ గా ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఖమేనీ తనకు చావు తప్పదన్న నిర్ణయానికి వచ్చారా..?అందుకే వీలునామా సిద్ధం చేశారా..? ఖమేనీ వీలునామాలో ఏముంది..? ఆయన వారసుడు ఎవరు..? అన్న చర్చ మొదలైంది.
ఇజ్రాయెల్‌తో ఇరాన్ మధ్య యుద్ధం.. తొమ్మిదవ రోజుకు చేరింది. అయితే సుప్రీం లీడర్ అలీ ఖమెనీ తీవ్ర ప్రాణభయంతో రహస్య బంకర్‌లో తలదాచుకున్నారని సమాచారం. ఇజ్రాయెల్ టెహ్రాన్‌తో సహా ఇరాన్ కీలక ప్రాంతాలపై క్షిపణి దాడులు చేస్తూ ఖమెనీని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ కీలక కమాండర్లు, న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఖమెనీ ముందు జాగ్రత్తగా ముగ్గురు వారసులను ప్రకటించారు. కానీ ఆ జాబితాలో ఆయన కుమారుడు మొజతాబా పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
అలీ ఖమేనీ ఉండే బంకర్ ఇరాన్ పర్వత ప్రాంతంలో అత్యంత సురక్షిత స్థానంలో ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే అదెక్కడున్నది ఎవ్వరికీ తెలియదు. కానీ ఇజ్రాయెల్-అమెరికా ఖమేనీ ఎక్కడున్నాడో తమకు తెలుసనని త్వరలోనే మట్టుబెడతామని చెబుతున్నాయి. ఖమేనీ అంతం చేసేవరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈనేపధ్యంలో ఖమేనీ వీలునామా..ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఖమేనీ వారసుడు ఎవరు..? అన్నదానిపై ఇప్పుడు ప్రపంచమంతా చర్చిస్తోంది. ఖమేనీ ముగ్గురు వారసులను ఎంపిక చేసినప్పటికీ, కుమారుడు మొజతాబాను పక్కకుపెట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం మొజతాబా రివల్యూషనరీ గార్డ్స్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే, రాజకీయ వ్యవస్థలోనూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కొందరు విశ్లేషకులు ఆయనను సుప్రీం లీడర్ పదవికి ఆయనే సరైన అభ్యర్థిగా చూస్తున్నారు. అయితే, ఖమేనీ మొజతాబాను జాబితా నుండి తప్పించడం వెనుక కుటుంబాన్ని రాజకీయ వివాదాల నుంచి రక్షించాలనే ఉద్దేశం ఉండవచ్చని భావిస్తున్నారు.
ఖమేనీ వీలునామాలో ఆస్తుల వివరాలు బహిర్గతం కాలేదు. కానీ ఆయన నియంత్రణలో ఉన్న వ్యాపార సంస్థలు, ఆర్థిక హోల్డింగ్‌లు రివల్యూషనరీ గార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని అంచనా. ఖమేనీ మొజతాబాను తప్పించడం ఇరాన్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా రివల్యూషనరీ గార్డ్స్, రాజకీయ నాయకుల మధ్య అధికార పోరు తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఖమేనీ వారుసల లిస్ట్‌లో అలీ ఖోమీ, హసన్ ఖోమీ, అలీరజా అరాఫీ పేర్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్ధ్యం గణనీయంగా దెబ్బతింది. టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలు, న్యూక్లియర్ సౌకర్యాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌కు కఠిన శిక్ష తప్పదని ఖమేనీ హెచ్చరించినా.. ఇరాన్ ఎదురుదాడి అంతంతమాత్రంగానే ఉంది. విదేశాంగ శాఖ శాంతి చర్చలు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఖమేనీ బంకర్‌లో ఉండి రివల్యూషనరీ గార్డ్స్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సమాచారం.
ఖమేనీ ఉన్న బంకర్‌లు అధునాతన రక్షణ వ్యవస్థలతో రూపొందించినవి. ఎలాంటి దాడులనైనా తట్టుకునే సామర్ధ్యం ఈ బంకర్లకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ గూఢచర్య సామర్థ్యం, ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసుకునే అవకాశం ఉందని.. పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. సో..ఖమేని ఉన్న బంకర్‌ను త్వరలోనే ఇజ్రాయెల్ కనిపెట్టే అవకాశాలున్నాయి. అందుకే ముందుగానే ఖమేనీ తన వారసుడెవరో వీలుూనామాలో రాశాడన్న చర్చ అంతర్జాతీయ సమాజంలో జరుగుతోంది. ఇజ్రాయెల్‌తో యుద్ధం ఇరాన్ జాతీయవాద భావనలను పెంచుతున్నా.. ఆర్థిక సంక్షోభం, సైనిక నష్టాలు ఖమేనీ నాయకత్వానికి సవాలుగా మారాయి.
ఇజ్రాయెల్ న్యూక్లియర్ వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తే, ఇరాన్ ప్రతిదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. ఖమేనీ బంకర్ నుంచే రాజకీయ, సైనిక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని నడిపిస్తున్నారు. కానీ ఆయన భద్రత ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది. యుద్ధం ఎలా ముగుస్తుంది. ఖమేనీ నాయకత్వం ఎలా కొనసాగుతుంది అనేది ప్రపంచ రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపనుంది. మరి ఖమేనీ ఈ సంక్షోభం నుంచి బయటపడగలరా లేక ఇరాన్ కొత్త నాయకత్వం వైపు అడుగులు వేస్తుందా అనేది చూడాలి..!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..