
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమలా హారిస్ పోటీపై అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీకి సిద్ధమైనట్లు సూచనప్రాయంగా తెలిపారు. మరికొన్ని రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇక.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కమలా యోచిస్తున్నట్లు డెమోక్రటిక్ పార్టీ వర్గాలు తెలిపాయి. దశాబ్దాలుగా కాలిఫోర్నియా వాసులు డెమోక్రట్లకే మొగ్గు చూపుతున్నారు. దాంతో.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే.. తప్పక విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది. అందులోనూ తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా నుంచే గవర్నర్ పదవికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్నాయి. అయితే.. పోటీ చేయాలా ..? వద్దా… అనేదానిపై కమలా హ్యారిస్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు..
ఇక.. గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన కమలాహారిస్ ఓటమి చవిచూశారు. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాలను సొంతం చేసుకుంటూ ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లతో విజయం సాధించగా.. కమలాహారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు.
ఓటమి తర్వాత స్పందించిన హారిస్.. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుందని.. అంతేకాని గెలవలేమని కాదని కామెంట్ చేశారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదేనని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..