Operation Sindhu: ఇరాన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం “ఆపరేషన్ సింధు”.. 110 మందిని సేఫ్‌గా ఇండియాకు తరలింపు!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయు పౌరుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం "ఆపరేషన్ సింధు"ను చేపట్టింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.

Operation Sindhu: ఇరాన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఆపరేషన్ సింధు.. 110 మందిని సేఫ్‌గా ఇండియాకు తరలింపు!
Operation Sindhu

Updated on: Jun 18, 2025 | 11:19 PM

పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత వారం రోజులుగా ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఆయా దేశాల్లోని భారత పౌరుల భద్రతలపై కేంద్ర దృష్టి సారించింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య, యుద్ధ ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తరలించడానికి భారతదేశం ‘ఆపరేషన్ సింధు’ను ప్రారంభించింది.ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉత్తర ఇరాన్‌ నుండి సుమారు 110 మంది భారతీయ విద్యార్థులను ఇరాన్‌ జూన్ 17వ తేదీన ఆర్మేనియాలోని మిషన్ల సమన్వయంతో ఆర్మేనియా దేశానికి తరలించింది. మళ్లీ వీరందరినీ బుధవారం మధ్యాహ్నం 2:55 గంటలకు అర్మేనియా రాజధాని యెరవాన్‌ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపింది. కాగా ఈ 110 మంది విద్యార్థుల బృందం జూన్ 19న, అంటే గురువారం తెల్లవారు జామున 2గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.  ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌ ద్వారా తెలియజేశారు.

మరోవైపు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే అక్కడి భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయులు వెంటనే టెహ్రాన్‌ను విడిచిపెట్టి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని వారు ఎవరైనా ఉంటే వెంటనే అధికారులతో సంప్రదింపులు జరిపి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరింది.

ప్రస్తుతం ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున, తదుపరి మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గదర్శకాలను పాటించాలని కోరింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..