ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో దాదాపు 50 రోజులుగా రెండు వైపులా బందీలుగా ఉన్నవారు విడుదల కావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ వారు బంధనాల నుంచి బయటపడతున్నారని తెలియడంతో వారికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులందరూ తరలివచ్చారు. కుటుంబ సభ్యులను ఇక చూస్తామనుకోలేదని విడుదలైన వారు కన్నీటి పర్యంతమయ్యారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని విడతల వారీగా హమాస్ విడుదల చేసింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, 14 ఏళ్లలోపు పిల్లలే. వీళ్లందరూ హమాస్ ప్రతినిధులు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. వ్యాన్లలో వారిని రెడ్ క్రాస్ సంస్థ బయటకు తీసుకొని వచ్చింది. ఇజ్రాయేల్ తమ దేశ పౌరులను హెలికాప్టర్లలో రాజధాని టెలిఅవివ్‌లోని ఆస్పత్రికి తరలించింది. బందీలుగా ఉన్నవారంతా ఆరోగ్యంగా ఉన్నారని ఇజ్రాయెల్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అటు పాలస్తీనాలో బందీలుగా ఉన్న తమ వారు తిరిగి వస్తున్నారని తెలియగానే ఇజ్రాయెల్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. వారికి స్వాగతం పలికేందుకు టెలిఆవివ్ స్క్వేర్‌కు వచ్చి రాత్రంతా వేచి ఉన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చేతిలో బందీలుగా ఉన్న 10 మంది థాయిలాండ్ పౌరులకు కూడా స్వేచ్ఛ లభించింది. వీరి ఫొటోలను థాయిల్యాండ్ విడుదల చేసింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, స్వదేశానికి వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని థాయిల్యాండ్ ప్రకటించింది. హమాస్ విడుదల చేసిన 24 మంది బందీల్లో ఒక ఫిలిప్పీన్స్ పౌరుడు కూడా ఉన్నారు.
హమాస్ శుక్రవారం మొత్తం 24 మంది బందీలను విడుదల చేసిందని, ఇజ్రాయెల్ 39 మంది మహిళలు, పిల్లలను తన జైళ్ల నుండి విడిపించిందని కీలక మధ్యవర్తి ఖతార్ ధృవీకరించింది. “విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు, వీరిలో కొందరు ద్వంద్వ పౌరులు, 10 మంది థాయ్ పౌరులు, ఫిలిపినో పౌరులు ఉన్నారు” అని దాని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ తెలిపారు.
నాలుగు రోజుల సంధి సమయంలో, కనీసం 50 మంది బందీలకు విముక్తి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 190 మంది పాలస్తీనా మిలిటెంట్ల చేతుల్లో ఉన్నారు. బదులుగా, 150 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేయాలని భావిస్తున్నారు.
యుద్ధం ప్రారంభమైన దాదాపు 2 నెలల నుంచి పాలస్తీనా, ఇజ్రాయెల్ చెందిన వేలాది మంది మరణించారు. వందలాది మంది ఆయా దేశాల్లో బందీలుగా ఉన్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..