
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి ఒప్పంద ప్రయత్నాలు జరుగుతుండగానే అమెరికా- ఇరాన్ మళ్లీ పరస్పర దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరానియన్ మీడియా ప్రకటించింది. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా ఖండించింది. ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎలాంటి విమానం కూల్చేయలేదని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ బుషెహర్ ప్రాంతంలో అమెరికా విమానం కూల్చివేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కూడా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ ఇరాన్ మీడియా ప్రచారాన్ని తోసి పుచ్చింది.
ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ మాత్రం బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతంలో ‘శత్రు విమానం’ను తమ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని పేర్కొంది. జామ్ కౌంటీ గవర్నర్ మసూద్ టాంగెస్టానీని ఉటంకిస్తూ, ఇరాన్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ‘ఈ రాత్రి జరిగిన ఘటనలో ఒక శత్రు విమానం కూల్చివేయబడింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది’ అని ఇరాన్ వార్తా సంస్థ టాంగెస్టానీ పేర్కొంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ వార్తలు వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన పరిమితులను సడలించడం, కాల్పుల విరమణను పొడిగించడం వంటి అంశాలపై రెండు దేశాలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
అయితే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న నాలుగు నౌకలను లక్ష్యంగా చేసుకుందని వార్తలు వచ్చాయి. వీటిలో అమెరికాతో సంబంధాలు ఉన్న నౌకలు కూడా ఉన్నాయని సమాచారం. ఇరాన్‌కు చెందిన చమురు వ్యాపార నెట్‌వర్క్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. ఇరాన్ మిలిటరీకి మద్దతుగా పనిచేస్తున్న చమురు రవాణా వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని 8 నౌకలను బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించింది. మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన ‘ఫ్లోరా’, కొమొరోస్ జెండా కలిగిన ‘హౌన్‌కాయో’, పనామా జెండా కలిగిన ‘ఇల్ గ్యాప్’ నౌకలు ఇందులో ఉన్నాయి. అయితే ఇరాన్ చమురు ఆదాయాన్ని ఉపయోగించి తన సైనిక శక్తిని పెంచుకునే ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.