Mojtaba Khamenei: శాంతి చర్చల వేళ.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మాస్ వార్నింగ్!

అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై గల్ఫ్ దేశాల్లో అమెరికాకు ఎలాంటి సురక్షిత స్థావరం ఉండబోదని చెప్పుకొచ్చారు. ఈ తన టెలిగ్రామ్ ఛానల్ వేధికగా అమెరికారు హెచ్చరికలు జారీ చేశారు.

Mojtaba Khamenei: శాంతి చర్చల వేళ.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మాస్ వార్నింగ్!
Iran's Supreme Leader Warns America

Updated on: May 26, 2026 | 4:23 PM

అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇక గల్ఫ్‌ దేశాల్లో అమెరికాకు సురక్షిత స్థావరాలు ఉండబోవని హెచ్చరించారు. తన తండ్రి మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టి ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించని మోజ్తాబా తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ ప్రాంతంలోని దేశాలు, భూభాగాలు ఇకపై అమెరికన్ సైనిక స్థావరాలకు రక్షణ కవచంగా ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.

కాలం అనేది వెనక్కి తిరిగిరాదని.. ఈ ప్రాంతంలోని దేశాలు, భూభాగాలు ఇకపై అమెరికన్ స్థావరాలకు రక్షణ కవచంగా పనిచేయవని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో చెడుకు గానీ, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి గానీ అమెరికాకు ఇకపై సురక్షిత ఆశ్రయం ఉండదు అని ఆయన అన్నారు. అయితే ఓ పక్క ఇరు దేశాల మధ్య శాంతిచర్చలు జరుగున్న తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

యుద్ధం తొలినాళ్లలో అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తన తండ్రి అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మోజ్తబా మార్చి నెలలో బాధ్యతలు స్వీకరించారు. అయితే తన తండ్రి మరణించిన ఆ దాడుల్లో మోజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదని నివేదికలు చెబుతున్నాయి.

అయితే ఓ పక్క టెహ్రాన్‌తో శాంతి ఒప్పంద చర్చలు సాగుతున్నాయని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నప్పటికీ, అంతకుముందే అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లు అమర్చుతున్న పడవలపై దాడులు చేసింది. అయితే ఈ దాడులపై యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందిస్తూ… ఇరాన్ బలగాల నుండి తమ సైనికులకు ఉన్న ముప్పు నుండి తప్పించుకునేందుకు ఈ దాడులు చేసినట్టు తెలిపారు. అలాగే కాల్పుల విరమణ చర్చల నేపథ్యంలో తమ సైన్యం నిగ్రహాన్ని పాటిస్తోందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us