
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ నెల రోజుల విరామం తర్వాత పరస్పర దాడులకు దిగాయి. హర్మూజ్ జలసంధిలోని లారక్ ద్వీపంలో ఉన్న ఇరాన్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ పై అమెరికా దాడులు చేసింది . దీనికి ప్రతిగా టెహ్రాన్ ప్రతీకార దాడులు చేస్తూ, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
హర్మూజ్ జలసంధిలోని కీలక రవాణా మార్గాల్లో ఇరాన్ మళ్లీ సీ మైన్స్ అమర్చడానికి సిద్ధమవుతోందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న అమెరికా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సముద్రపు మైన్లను మోసుకెళ్లే రాకెట్లను ప్రయోగించే రెండు లాంచ్ సిస్టమ్స్‌ను అమెరికా టార్గెట్ చేసింది. ప్రధాన నౌకా మార్గాల్లో గతంలో ఉంచిన సీమైన్స్‌ను ఇప్పటికే తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఇటీవల ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మరోసారి ఆ జలసంధిలో సీ మైన్స్ అమర్చేందుకు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చాలా రోజుల విరామం తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మైలురాయిని దాటింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ముడి చమురు ధర 2 శాతానికి పైగా ఎగబాకి, ఒక దశలో 90.68 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం కూడా ఇది 90 డాలర్ల మీదుగానే ట్రేడవుతోంది. ఒకవేళ ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు మరింతగా దూసుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
ముస్లిం దేశాల ఐక్యతకు ఇరాన్ అధినేత పిలుపు
ముస్లిం దేశాలన్నీ, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ నిజమైన శత్రువుపై పోరాడేందుకు కలసికట్టుగా నిలవాలని ఇరాన్ అత్యున్నత నేత మొజ్తబా ఖమేనీ కోరారు. గల్ఫ్ దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే పాలస్తీనా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, పశ్చిమాసియాలో సమస్యలు తగ్గే సూచన కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలు ఇలా విడివిడిగా ఉండటం వల్ల శత్రువులకు మాత్రమే లాభం కలుగుతోందని స్పష్టం చేశారు. మొహమ్మద్ ప్రవక్త జయంతి వారోత్సవాల సందర్భంగా టెలిగ్రామ్ వేదికగా మొజ్తబా ఖమేనీ ఈ సందేశాన్ని పంచుకున్నారు. ముస్లింలు అందరూ ఐక్యంగా ఉండి, అన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.
పాలస్తీనా సంక్షోభం పై ఖమేనీ వ్యాఖ్య
ముస్లింలు గనుక ఐక్యంగా ఉండి ఉంటే, పాలస్తీనా ప్రజలు నేడు ఇలా నిస్సహాయ స్థితిలో ఉండేవారు కాదని అభిప్రాయపడ్డారు. గల్ఫ్ ప్రాంత ప్రజలు, ప్రభుత్వాలు ఇస్లాం జెండా కింద ఒక్క తాటిపై నిలబడితే, దుర్మార్గులు ఎవరూ తమ భూభాగాలపై కన్నేసే సాహసం చేయలేరని స్పష్టం చేశారు. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలు తమ నిజమైన శత్రువు ఎవరనేది గ్రహించాలని, వారి కుట్రలను అర్థం చేసుకుని ధైర్యంగా ఎదురు నిలవాలని ఆయన కోరారు.