Global Times: ఆపరేషన్ సింధూర్‌పై చైనా మీడియా తప్పుడు ప్రచారం.. ఇచ్చి పడేసిన భారత్

ఆపరేషన్ సిందూర్‌పై చైనా మీడియా చేసిన తప్పుడు ప్రచారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వార్తలు రాసే ముందు వాస్తవాలు పరిశీలించుకోవాలని సూచించింది. భారత్ విమానాన్ని పాక్ కూల్చిందన్న గ్లోబల్ టైమ్స్ కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Global Times: ఆపరేషన్ సింధూర్‌పై చైనా మీడియా తప్పుడు ప్రచారం.. ఇచ్చి పడేసిన భారత్
India Slams China

Updated on: May 07, 2025 | 8:19 PM

ఉగ్రవాదులు, వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచదేశాలను సమర్థిస్తుంటే.. ఈ అంశంలో కూడా చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. చైనా అధికారిక మీడియా అయినా గ్లోబల్ టైమ్స్‌.. ఈ అంశంలో తప్పుడు కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని సూచించింది. మీ మూలాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని కోరింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది. భారత్ దాడులకు ప్రతిగా పాకిస్థాన్‌ వైమానిక దళం భారతీయ యుద్ధ విమానాన్ని కూల్చివేసిందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌‌ ఫోటోలంటూ కుప్పకూలిన విమానాల పాత ఫోటోలను చూపించింది. అయితే పాత చిత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్లోబల్ టైమ్స్‌పై బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి పాక్ అనుకూల హ్యాండిల్స్ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, మీడియా సంస్థలు ఇలాంటి సమాచారం షేర్ చేసేటప్పుడు సంబంధిత వర్గాలను సంప్రదించి ధ్రువీకరించుకోవాలని సూచించింది. అలాకాకుండా కథనాలు ప్రచురించడం తీవ్రమైన బాధ్యతారాహిత్యమవుతుందని ఘాటుగా విమర్శించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సైతం గ్లోబల్ టైమ్స్ కథనంలో పాత ఫోటోలను ప్రస్తుత ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించినట్టు నిర్ధారించింది. ఇందులో ఒక ఫోటో 2024 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-29 విమానం కూలిపోయినప్పటిది కాగా, రెండవది 2021లో పంజాబ్‌లో ఐఏఎఫ్ మిగ్-21 కుప్పకూలినప్పటి ఘటనగా తేల్చింది. పహల్గామ్ దాడిని సహా అనేక అంశాలను గ్లోబల్ టైమ్స్ దృష్టికి చైనాలోని ఇండియన్ ఎంబసీ తీసుకువచ్చింది.