నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి.. ‘సి-17’ విమానాలు, హెలికాప్టర్లు! 

ప్రధాని మోదీ నేపాల్ ప్రధానితో ఫోన్ కాల్ లో మాట్లాడిన వెంటనే.. ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు, ప్రాణ రక్షణ మందులతో  మొదటి విడతగా 10 టన్నుల  మానవతా సాయాన్ని నేపాల్ కు భారత్ పంపింది. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J ద్వారా నేపాల్‌కు తరలించింది. 

నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి..  సి-17 విమానాలు, హెలికాప్టర్లు! 
India Sends 47.5 Tonnes Of Humanitarian Aid To Nepal

Updated on: Aug 28, 2026 | 4:20 PM

టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటికే 98 మంది మరణించగా 1500 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశం నేపాల్‌కు భారత్ తక్షణ సహాయం అందించింది. ప్రధాని మోదీ నేపాల్ ప్రధానితో ఫోన్ కాల్ లో మాట్లాడిన వెంటనే.. ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు, ప్రాణ రక్షణ మందులతో  మొదటి విడతగా 10 టన్నుల  మానవతా సాయాన్నిభారత్ నేపాల్ కు పంపింది.  వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J ద్వారా నేపాల్‌కు తరలించింది.

ప్రధాని మోదీ హామీ – నేపాల్ ప్రధానితో సంభాషణ:

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన  భీకర వరద పరిస్థితుల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్‌లో మాట్లాడారు. ఘోర విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నేపాల్‌కు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సహాయక, రక్షణ చర్యల్లో ఇరు దేశాల బృందాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు.

‘సి-130జె’లో బయల్దేరిన అత్యవసర సామగ్రి

వరదలతో అతలాకుతలమవుతున్న నేపాల్‌కు సహాయక చర్యలను భారత ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఘాజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ నుంచి గురువారం రాత్రి 8.35 గంటలకు  భారత వైమానిక దళానికి  చెందిన ‘సి-130జె’  సూపర్ హెర్క్యులెస్ రవాణా విమానం తొలి విడత 10 టన్నుల సహాయక సామగ్రిని విజయవంతంగా ఖాట్మండుకు చేర్చింది.

సహాయక సామగ్రిలో ఏమున్నాయి?

ప్రస్తుతం నేపాల్ సరిహద్దు జిల్లాల్లో వరద ఉధృతికి అనేకమంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. విపత్తు తీవ్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో భారత్ నుంచి మరిన్ని సహాయక విమానాలు నేపాల్‌కు వెళ్లనున్నాయి.  భారత్ పంపిన సహాయక సామగ్రిలో రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు,  వసతి టెంట్లు, బ్లాంకెట్లు,  అత్యవసర మందులు,  పరిశుభ్రతకు హైజీన్ కిట్లు, సోలార్ దీపాలు ఉన్నాయి.  నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ సహాయక సామగ్రిని నేపాల్ పర్యాటక మంత్రి ఖడ్గ రాజ్ పౌడేల్‌కు అధికారికంగా అందజేశారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఈ సాయంపై స్పందిస్తూ “కష్టకాలంలో నేపాల్ ప్రజల పక్కన భారత్ నిలుస్తుంద”ని అన్నారు.

సిద్ధంగా ‘సి-17’ విమానాలు, హెలికాప్టర్లు

పరిస్థితి తీవ్రత దృష్ట్యా నేపాల్‌లో సహాయక చర్యలు అందించేందుకు భారత వైమానిక దళం సంసిద్ధతను తెలియచేసింది. అవసరమైతే మరింత సహాయక సామాగ్రితో పాటు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్డానికి  C-17, సి-130 రవాణా విమానాలతో పాటు ప్రత్యేక రెస్క్యూ హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచింది. పొరుగు దేశానికి అన్ని వేళలా అండగా ఉంటామని భారత్ భరోసా ఇచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us