తెల్లవారుజామున 3 గంటలకు.. లుంగీలో పక్క దేశం పారిపోయిన మాజీ అధ్యక్షుడు!

బంగ్లా దేశీయులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ (81) లుంగీతో తెల్లవారుజామున 3 గంటలకు థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కి పారిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

తెల్లవారుజామున 3 గంటలకు.. లుంగీలో పక్క దేశం పారిపోయిన మాజీ అధ్యక్షుడు!
Bangladesh Ex President Abdul Hamid

Updated on: May 14, 2025 | 10:33 AM

ఢాకా, మే 14: బంగ్లా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ (81) లుంగీతో తెల్లవారుజామున 3 గంటలకు థాయ్‌లాండ్ విమానం ఎక్కి పారిపోయారు. వేకువ జామున బంగ్లా దేశీయులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఢాకా విమానాశ్రయం నుంచి ఆయన దేశం విడచి వెళ్లడం చర్చణీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె గత ఏడాది దేశం విడిచి భారత్‌లో తలదాచుకున్నారు. ప్రస్తుతం హసీనా పార్టీకి చెందిన నాయకులు పలు కేసుల్లో చిక్కుకున్నారు. ఇందులో మాజీ అధ్యక్షుడు హమీద్‌ కూడా ఉన్నారు.

గత ఏడాది అల్లర్లలో మాజీ అధ్యక్షుడు హమీద్‌పై కూడా హత్య కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో హమీద్‌ సరైన వస్త్రాలు కూడా ధరించకుండా లుంగీలో ఎయిర్ పోర్టు నుంచి థాయ్ లాండ్ పారిపోయినట్లు తెల్పుతూ.. రెండు మీడియా పోర్టల్‌లలో హమీద్ వీల్‌చైర్‌లో లుంగీ ధరించి ఉన్న CCTV దృశ్యాలను చూపించాయి. అయితే హమీద్‌ వైద్య చికిత్స నిమిత్తం థాయ్‌ వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన దేశం విడిచి పారిపోయినట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.

కాగా గత వారం ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం అవామీ లీగ్‌ను నిషేధించింది. సవరించిన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం హసీనా అవామీ లీగ్‌ను అధికారికంగా నిషేధిస్తూ సోమవారం గెజిట్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ కూడా అవామీ లీగ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 1949 లో ఏర్పడిన అవామీ లీగ్ అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో బెంగాలీల స్వయంప్రతిపత్తి కోసం దశాబ్దాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. చివరికి 1971 లో విముక్తి యుద్ధానికి దారితీసింది. హసీనా, అనేక మంది ఇతర అవామీ లీగ్ నాయకులు బహిష్కరణకు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు హమీద్ థాయిలాండ్‌కు వెళ్లడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో ఆయనపై ఇప్పటికే కేసు నమోదై ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా అవామీ లీగ్‌ విద్యార్థి విభాగం నుంచి హమీద్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత హమీద్ బంగ్లా అధ్యక్షుడిగా రెండు సార్లు (2013 నుంచి 2023 వరకు) పనిచేశారు. అయితే 2024లో జరిగిన ఆందోళన కాలంలో నాటి ప్రధాన మంత్రి షేక్ హసీనా, ఆమె సహాయకులపై నమోదైన హత్య కేసులో హమీద్ కూడా సహ నిందితుడుగా ఉన్నారు. హసీనాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.