
బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. బంగారం వెలికితీత, కరిగించడానికి ఉపయోగించే ఓ పదార్థానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అదే పాదరసం. ఈ మెర్క్యూరీని బయటకు తీయడం, దాన్ని ఓ ప్రత్యేక పద్దతిలో పాదరసంగా మార్చడం వెనుక కఠోర శ్రమ ఉంటుంది. అంతే రిస్క్ కూడా ఉంటుంది. పాదరసం బయటకు తీసే క్రమంలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది.
మానవాళితో పాటు పర్యావరణానికి ముప్పైన ఈ పాదరసం గనులను ఎప్పుడో బ్యాన్ చేశారు. అయితే.. బంగారం ధరలు పెరగడంతో.. మెర్క్యూరీకి కూడా అంతే మొత్తంలో ధర పెరిగింది. ఒకప్పుడు ఒక కిలోగ్రామ్ కేవలం 1600 డాలర్లు మాత్రమే ఉంది. ఇప్పుడది 18వందల డాలర్లకు పైమాటే. అంటే మన కరెన్సీలో లక్షన్నర రూపాయలకు పైనే. అందుకే మెక్సికోలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి.. పాదరసం కోసం ఎదురెళ్తున్నారు. ఈ అక్రమ మైనింగ్‌లో చాలామంది ప్రాణాలు కూడా విడిచారు. అయినా ఇదే జీవనాధారంగా మెక్సికోలో చాలామంది బతుకుతున్నారు.
సియెర్రా గోర్డా అని పిలువబడే మెక్సికోలోని పైన్ పర్వతాలలో పాదరసం తవ్వకం ప్రస్తుతం విపరీతంగా జరుగుతోంది. పర్వతాల్లో.. కేవలం మనిషి పట్టేంత దారుల్లో, కటిక చీకట్లో హెడ్ లైట్ వెలుతురులో లోపల వరకూ వెళ్తూ పాదరసం వెలికి తీస్తున్నారు మెక్సికన్లు. ఘన రూపంలో ఉన్న మెర్క్యూరీని ఓవెన్లలో వేడి చేసి.. వాయు రూపంలోకి మార్చి.. తిరిగి ద్రవంగా మారుస్తున్నారు. పాదరసం చిన్న కోకా-కోలా సీసాలలో సేకరించి “కొయెట్స్” అని పిలువబడే మధ్యవర్తులకు దాదాపు 1800 డాలర్లకు అమ్ముతున్నారు. డిమాండ్ పెరిగే కొద్దీ.. మైనింగ్ చేసే వాళ్లు పెరుగుతున్నారు. వేలాది ఇదే ప్రధాన ఆదాయ వనరుగా జీవిస్తున్నారు.
మెక్సికోలో ఉత్పత్తయ్యే పాదరసం అక్రమ రవాణా ద్వారా కొలంబియా, బొలీవియా, పెరూలకు చేరుతుంది. ఈ దేశాల్లో అమెజాన్ అడవులు విస్తరించి ఉండటంతో, అమెజాన్ అటవీ ప్రాంతంలో గోల్డ్ మైనింగ్‌కు ఈ పాదరసం ఉపయోగపడుతుంది. ఇది పర్యావరణానికి భారీ నష్టం కలిగిస్తూ, నదుల ద్వారా విషం ప్రజలకు, అడవిలోని జంతువులకు సోకుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాదరసం తవ్వకాలను నిషేధించారు. అయినా.. మెక్సికో లాంటి చోట అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..