గ్రాండ్ బహామాస్ ను ‘ డోరియన్ ‘ హరికేన్ వణికించేసింది. ఈ ప్రకృతి వైపరీత్యానికి ఈ దేశం చిన్నాభిన్నమైంది. భారీ వర్షాలు, వరదలు, పెను గాలుల బీభత్సంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఈ తుఫానుకు 30 మంది బలయ్యారని అధికారులు చెబుతుండగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. చెట్లు, భవనాలు కూలిపోయి వేలమంది గాయపడ్డారు. సుమారు 70 వేల మందికి ప్రాణరక్షణ మందులు అవసరమని అంచనా వేస్తున్నారు. గ్రేట్ ఎబాకో నగరం నిర్మానుష్యంగా మారింది. ఈ తుఫానుకు ఫ్రీపోర్టు లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఘోరంగా దెబ్బ తిన్నది. పెను గాలుల విధ్వంసానికి విమానాల రెక్కలు విరిగిపోగా.. విడిభాగాలు ముక్కలు, ముక్కలై దారుణ పరిస్థితిని కళ్ళకు కడుతోంది. ఇక్కడికి వందల సంఖ్యలో నిరాశ్రయులు చేరుకున్నప్పటికీ.. విమాన సౌకర్యమేదీ లేక పోవడంతో.. అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్ఛే నౌకలకోసం నిరీక్షిస్తున్నారు. ఆ నౌకల్లో ఏదో ఒక దేశానికి త్వరగా చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. చివరకు తమ పెంపుడు కుక్కలు, ఇతర జంతువులను కూడా తమతో బాటుతీసుకువస్తున్నవారితో విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. పొరుగునున్న దేశాలనుంచి వాలంటీర్లు వఛ్చి వీరికి ఆహారం , ఇతర సదుపాయాలు కల్పించేందుకు యత్నిస్తున్నా అవి ఏ మాత్రం సరిపోవడంలేదు. బహామాస్ లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, దోపిడీ దొంగలు, సంఘ విద్రోహ శక్తులు, షాపులపైనా, మాల్స్ పైనా దాడులకు పాల్పడుతూ అందినంతా దోచుకుపోతున్నారని, అమాయకులైన ప్రజలను కూడా దోచుకుంటున్నారని మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.