Joe Biden: హనీమూన్ ముగిసింది.. షేక్ అవుతోన్న జో బైడెన్ అధ్యక్ష పీఠం..

|

Aug 28, 2021 | 11:38 AM

Aghan Crisis - Joe Biden: అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Joe Biden: హనీమూన్ ముగిసింది.. షేక్ అవుతోన్న జో బైడెన్ అధ్యక్ష పీఠం..
Us President Joe Biden
Follow us on

Aghan Crisis – Joe Biden: అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఓ రకంగా బైడెన్ హనీమూన్ ఇక ముగిసిపోయిందని.. ఆయన అధ్యక్ష పీఠం షేక్ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో కరోనాను కట్టడి చేయడంలో బైడెన్ విఫలం చెందారని గతంలో విమర్శలు వినిపించాయి. అయితే కరోనా పలు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య కావడంతో బైడెన్ వర్గం విమర్శలను కాస్త లైట్ తీసుకుంది. అయితే ఆగస్టు 15న అఫ్గానిస్థాన్ మళ్లీ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయినప్పటి నుంచి ఆయనపై విమర్శల దాడి మరింత పెరిగింది. అఫ్గాన్ నుంచి ఒక్కసారిగా అమెరికా సేనలను ఉపసంహరించినందు వల్లే అఫ్గానిస్థాన్‌ ప్రజల జీవితల్లో మళ్లీ చీకటి అలుముకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాలిబన్ల సామర్థ్యాన్ని సరిగ్గా అంచనావేయడంలో బైడెన్ పూర్తిగా విఫలం చెందినట్లు ఆరోపిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి.. అఫ్గానిస్థాన్‌లో నేటి పరిస్థితులకు బైడెన్ కారణమని ఆరోపించారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి.. వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్తే మంచిదన్నారు.

ఈ నేపథ్యంలో కాబూల్‌లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 200 మంది మరణించగా.. వీరిలో 13 మంది అమెరికా సేనలు కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత బైడెన్‌పై ముప్పేట దాడి మొదలయ్యింది. అఫ్గాన్ పరిణామాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ప్రతిష్ట మసకబారుతోంది. దీన్ని సగటు అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు అగ్రరాజ్యంగా  యావత్ ప్రపంచాన్ని అమెరికా శాసించింది. అఫ్గాన్ పరిణామాల తర్వాత అమెరికా అగ్రరాజ్య హోదాను ఓ రకంగా కోల్పోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా మీడియా కూడా బైడెన్ వైఫల్యాలను తూర్పారబడుతోంది. దీంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ మునుపెన్నడూ లేనంతగా పడిపోయింది.

బైడెన్ రాజీనామాకు రిపబ్లికన్ల డిమాండ్..

అఫ్గానిస్థాన్ విషయంలో బైడెన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న అమెరికన్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించడంలోనూ ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. అమెరికాకు అండగా నిలుస్తున్న మిత్ర దేశాలు, భాగస్వామ్య దేశాల నమ్మకాన్ని కూడా బైడెన్ వమ్ముచేశారని విమర్శిస్తున్నారు. కమాండర్ ఇన్ చీఫ్‌గా బైడెన్ పనితీరు సరిగ్గా లేదని ఆరోపిస్తున్నారు. బైడెన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బైడెన్‌ అభిశంసనకు మరికొందరు పిలుపునిస్తున్నారు.

US Vice President Kamala Harris (File Photo)

కమలా హారిస్‌ అమెరికా అధ్యక్షులవుతారా?

అటు బైడెన్ స్థానంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను అధ్యక్షురాలిగా నియమిస్తే మంచిదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.  మొత్తానికి ఆఫ్గానిస్థాన్ పరిణామాల నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష పీఠం కదులుతోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడు మాసాల్లోనే బైడెన్‌పై ఈ స్థాయి వ్యతిరేకిత అనూహ్యమే. కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై చర్చ మొదలుకావడం బైడెన్ వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలు అమెరికాలో ఈ స్థాయిలో ప్రభావం చూపుతుందని బైడెన్ వర్గం ఊహించి ఉండకపోవచ్చు.  మరి అమెరికాలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచిచూడాల్సిందే.

Also Read..

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..! ఇన్సూరెన్స్ కోసం ఎస్బీఐతో ఒప్పందం.. 40 లక్షల వరకు కవరేజీ..

పుష్పరాజ్‌ను ఢీకొట్టబోయేది ఎవరో తెలుసా.? ‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’ను పరిచయం చేసిన చిత్ర యూనిట్‌.