
ప్రపంచ శాంతి, సామరస్య నిర్మాణం, మానవతా సేవలలో అపూర్వమైన కృషి చేసినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్టాత్మక “వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ – 2025” అవార్డు లభించింది. అమెరికాలోని బోస్టన్ గ్లోబల్ ఫోరమ్ (BGF), AI వరల్డ్ సొసైటీ (AIWS) సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందజేశాయి.
ఈ అవార్డు పది సంవత్సరాల చరిత్ర కలిగినది. 2015లో మొదలైన ఈ గౌరవాన్ని గతంలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, జర్మనీ మాజీ చాన్సలర్ అంజెలా మెర్కెల్, ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ వంటి ప్రముఖులు అందుకున్నారు. ఈసారి భారత ఆధ్యాత్మిక నేత గురుదేవ్‌కు ఈ గౌరవం లభించడం దేశానికి గర్వకారణమైంది. “21వ శతాబ్దంలో నిజమైన శాంతి, ఆధ్యాత్మిక సమతుల్యత, మతాంతర సంభాషణ, నైతిక సాంకేతికతలపై ఆధారపడాలి” అని ఈ అవార్డును ప్రకటిస్తూ బోస్టన్ గ్లోబల్ ఫోరమ్ పేర్కొంది.
గురుదేవ్ ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో సామరస్యాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. కొలంబియాలో 52 ఏళ్ల సాయుధ పోరాటం ముగియడానికి ఆయన మధ్యవర్తిత్వం దోహదపడింది. ఇరాక్, శ్రీలంక, మయన్మార్, వెనిజువెలాలో శత్రువులను ఒక్క చోట చేర్చి చర్చల వేదికకు తీసుకువచ్చారు. కశ్మీర్‌లో వందలాది మిలిటెంట్లను హింసను వదిలి సాధారణ జీవితంలోకి రప్పించారు. “తూర్పు జ్ఞానాన్ని, పాశ్చాత్య ఆవిష్కరణలను కలిపిన ఆధ్యాత్మిక నాయకుడు గురుదేవ్. నైతిక ధైర్యం, మానవత్వం, సాంకేతిక యుగంలో నూతన దిశ చూపిస్తున్న నేత” అని బోస్టన్ గ్లోబల్ ఫోరమ్ సీఈఓ న్గుయెన్ ఆన్ తుయాన్ అభివర్ణించారు.
గురుదేవ్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 1981 నుంచి కోట్లాది మందిలో శాంతి, దయ, సమతుల్యతను నింపుతోంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు అలుముకుంటున్న ప్రాంతాల్లో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం చేశారు. ధ్యానం, ప్రాణాయామం ద్వారా 8 లక్షల మందికి పైగా ఖైదీలను పునరావాసం చేశారు. 70కి పైగా నదులు, వేల నీటి వనరులను పునరుద్ధరించారు. 1,300 ఉచిత పాఠశాలల ద్వారా 1 లక్ష మందికి పైగా పేద పిల్లలకు విద్య, ఆహారం అందిస్తున్నారు. “మీరు శాంతిని ఆలోచనగా కాక, ఆచరణగా నేర్పించారు. కరుణ, ప్రేమ, అర్థం చేసుకోవడం – ఇవే మీ శాంతి సూత్రాలు” అని బోస్టన్ గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, మాజీ గవర్నర్ మైఖేల్ డుకాకిస్ వ్యాఖ్యానించారు.
“శాంతి మాటల్లో కాదు, ఆచరణలో ఉండాలి. భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో, శాంతి నిర్మాణానికీ అంతే ఇవ్వాలి. మానవత్వం, నైతిక శక్తి లేకుండా సమాజం ముందుకు వెళ్లదు. హింసలేని, ఒత్తిడి లేని, సృజనాత్మక సమాజం మన లక్ష్యం కావాలి” అని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు.
ఇటీవల ఉత్తర అమెరికా పర్యటనలో కూడా గురుదేవ్‌కు ఘన స్వాగతం లభించింది. కెనడా వాంకూవర్ సిటీ అక్టోబర్ 18, 2025ను “గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ డే”గా ప్రకటించింది. సియాటెల్, పోర్ట్‌ల్యాండ్ నగరాలు వరుసగా అక్టోబర్ 19, 20 తేదీలను అదే పేరుతో గౌరవించాయి. పోర్ట్‌ల్యాండ్‌లో జరిగిన శాంతి ధ్యాన సభలో 1,300 మందికి పైగా పాల్గొని, నగరంలో అతి పెద్ద పీస్ గ్యాదరింగ్‌గా నిలిచింది.
లాస్ ఏంజెలెస్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాబ్సల్యూట్ ఇంటెలిజెన్స్‌ను గురుదేవ్ ప్రారంభించారు. చైతన్యం, కృత్రిమ మేధస్సు కలయికపై పరిశోధనలకు దారితీశారు. ఈ సంస్థ ద్వారా ఆధ్యాత్మికత, న్యూరోసైన్స్, ఎథికల్ టెక్నాలజీ రంగాలు ఒకే వేదికపైకి వస్తున్నాయి.
ఈ అవార్డు భారతీయ ఆధ్యాత్మికతను, మానవతా నేతృత్వాన్ని ప్రపంచ పటంలో మరింత ఎత్తులో నిలబెట్టింది. “విశ్వ గురువు”గా భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తున్నదని, పురాతన జ్ఞానం ఆధునిక పరిపాలనకు మార్గదర్శకమని ఈ గౌరవం మరోసారి రుజువు చేసింది.