కరోనా విజృంభణ తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పైపైకి చేరుకుంది.10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.
కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం దిగి వచ్చాయి. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ భాగస్వామి బయోన్‌టెక్‌తో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడవ దశ ఫలితాల్లో పురోగతి సాధించామన్న ప్రకటనతో బంగారం ధరలు నేల చూపులు చూసింది. వెండి ధరలు కూడా ఇదే బాట పట్టాయి. ఏకంగా బంగారం ధర 10 గ్రాములకు 1,000 రూపాయలు పతనమైంది. ఎంసీఎక్స్ లో డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకి 2 శాతం క్షీణించి 51,165 రూపాయల వద్దకు చేరింది. వెండి ఫ్యూచర్స్ 3.5 శాతం లేదా 2,205 రూపాయలు పతనమై కిలోకు 63,130 కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో, స్పాట్ బంగారం 2 శాతం క్షీణించి ఔన్స్ ధర 1909.99 డాలర్లకు చేరుకుంది. మరోవైపు మారక విలువ కాస్త బలపడింది. డాలర్ తో పోల్చితే 74.155 గా ఉంది. మరోవైపు, బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.