Israel vs Gaza: కిలో చక్కెర రూ.7 వేలు, లీటర్ పెట్రోల్ రూ.2 వేలు… ఇజ్రాయెల్ దాడులతో ఆర్థికంగా చితికిపోయిన గాజా

ఇజ్రాయెల్ దాడులతో ఆర్థికంగా చితికిపోయింది గాజా. తిండీ, నీళ్లు కూడా లేని దురవస్థలో గాజా ప్రజలు మగ్గుతున్నారు. వేలకు వేలు కుమ్మరిస్తేనే నిత్యావసరాలు దొరికే దుస్థితి. కేజీ పంచదార రూ. 7 వేలు, లీటర్ పెట్రోల్ రూ. 2 వేలు పలుకుతోంది. ఉప్పూ పప్పూ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన...

Israel vs Gaza: కిలో చక్కెర రూ.7 వేలు, లీటర్ పెట్రోల్ రూ.2 వేలు... ఇజ్రాయెల్ దాడులతో ఆర్థికంగా చితికిపోయిన గాజా
Gaza Economically Devastate

Updated on: Jul 12, 2025 | 7:43 AM

ఇజ్రాయెల్ దాడులతో ఆర్థికంగా చితికిపోయింది గాజా. తిండీ, నీళ్లు కూడా లేని దురవస్థలో గాజా ప్రజలు మగ్గుతున్నారు. వేలకు వేలు కుమ్మరిస్తేనే నిత్యావసరాలు దొరికే దుస్థితి. కేజీ పంచదార రూ. 7 వేలు, లీటర్ పెట్రోల్ రూ. 2 వేలు పలుకుతోంది. ఉప్పూ పప్పూ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహారం, నీళ్లు, కూరగాయలు, చివరకు మందుబిళ్లలు కొనాలన్నా కరెన్సీ లేక కష్టమౌతోంది గాజాలో పేదలకు. ఒక్క పూట కడుపు నింపుకోడానికి గతంలో కూడబెట్టుకున్న బంగారం మొత్తాన్నీ తెగనమ్ముకుంటున్న శాపగ్రస్థ కుటుంబాలు వేలల్లో ఉన్నాయక్కడ. గతంలో రెండు రోజులకు నాలుగు డాలర్లు ఖర్చయ్యేది. ఇప్పుడు 12 డాలర్లున్నా పూట గడవడం లేదు. ముఖ్యంగా చక్కెర ధర భారీగా పెరిగిపోయింది. యుద్ధానికి ముందు కిలో చక్కెర 2 డాలర్లుంటే.. ఇప్పుడది 100 డాలర్లు పలుకుతోంది. లీటరు పెట్రోలైతే మన రూపాయల్లో రెండువేలు దాటింది.

ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకర యుద్ధంతో ఆర్థికంగా కుదేలైంది గాజా. అసలే ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత. ఆపై కరెన్సీ కష్టాలు… గాజాలో పాలస్తీనియన్లకు నేలమీదే నరకాన్ని చూపెడుతున్నాయి. యుద్ధం కారణంగా అక్కడి బ్యాంకులు, ఏటీఎంలు మూతబడ్డంతో కరెన్సీ బ్రోకర్ల రాజ్యమే నడుస్తోంది. అటు… ఇజ్రాయెల్‌ గాజాలోకి నగదును నిలిపివేసింది. స్థానిక సంపన్న కుటుంబాలు బ్యాంకుల్ని ఖాళీ చేసి దేశం విడిచి వెళ్లిపోయాయి. ఇదే ఆసరాగా బ్రోకర్లు ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్స్‌ను డాలర్‌లోకి మార్చేందుకు భారీగా కమీషన్‌ తీసుకుంటున్నారు. గతంలో ఐదు శాతం కమీషన్‌తో డాలర్ కాగితం ఇచ్చే దళారులు ఇప్పుడు దాన్ని 40 శాతానికి పెంచేశారు. దీంతో ఉప్పూ పప్పూ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి.

ఓవైపు కొత్త కరెన్సీ నిలిచిపోవడం.. మరోవైపు చిరిగిపోయిన పాత నోట్లను వ్యాపారులు తీసుకోకపోవడం పాలస్తీనియన్లకు ఇబ్బందిగా మారింది. ప్రపంచబ్యాంకు రిపోర్ట్ ప్రకారం గాజాలో 90 శాతం మంది చేతినిండా పని దొరకని నిరుద్యోగులే. అటు 230 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గనంటోంది. దీనికి తోడు ముంచుకొచ్చిన నగదు సంక్షోభం. మొత్తంగా యుద్ధపీడిత గాజాలో జనజీవనం దారుణావస్థకు చేరింది. ఆకలి కేకలతో అల్లాడుతోంది.