భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం.. నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి..

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 నోబెల్ శాంతి బహుమతి ఐక్యరాజ్యసమితి మాజీ మానవ హక్కుల హైకమిషనర్, ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతమ్ నవీ పిళ్లైని వరించింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల పరిరక్షణ, యుద్ధ నేరాలపై విచారణ, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన దశాబ్దాల నిరంతర పోరాటానికి గుర్తింపుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది.

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం.. నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి..
Navanethem Pillay Wins Nobel Peace Prize 2026

Updated on: Oct 09, 2026 | 2:58 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2026 ఏడాదికి గానూ ఐక్యరాజ్యసమితి మాజీ మానవ హక్కుల హైకమిషనర్, ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతమ్ పిళ్లైని వరించింది. అంతర్జాతీయ చట్టాల బలోపేతం, ప్రపంచ శాంతి స్థాపన, మానవ హక్కుల పరిరక్షణలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై రాజీలేని పోరాటం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చడంలో నవనీతమ్ పిళ్లై చూపిన తెగువను కమిటీ కొనియాడింది. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆమె పోషించిన పాత్ర శాంతి స్థాపనకు బలమైన పునాదిగా నిలిచిందని తెలిపింది.

ఎవరీ నవనీతమ్ పిళ్లై?

నవనీతమ్ పిళ్లై 1941లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఒక భారత సంతతి కుటుంబంలో జన్మించారు. వర్ణవివక్ష కాలంలో అనేక వివక్షలను ఎదుర్కొని న్యాయవాదిగా ఎదిగారు. దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రావిన్స్‌లో సొంతంగా లా ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. నెల్సన్ మండేలా వంటి స్వాతంత్ర్య సమరయోధుల తరఫున, వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమకారుల కోసం కోర్టుల్లో వాదించారు. రువాండా మారణకాండ విచారణ ట్రిబ్యూనల్‌లో న్యాయమూర్తిగా, అధ్యక్షురాలిగా సేవలందించారు. యుద్ధంలో అత్యాచారాలను జాతి నిర్మూలన నేరంగా గుర్తించిన చారిత్రక తీర్పులో ఆమె పాత్ర కీలకం. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలందించారు. ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల విభాగానికి చీఫ్‌గా వ్యవహరించి ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల పరిరక్షణకు గళమెత్తారు.

ప్రధానం ఎప్పుడు..?

శాంతి బహుమతి కింద బంగారు పతకం, ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందజేస్తారు. సంప్రదాయం ప్రకారం.. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో జరిగే అధికారిక వేడుకలో నవనీతమ్ పిళ్లైకి ఈ పురస్కారాన్ని బహూకరించనున్నారు. అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల గొంతుకగా నిలిచిన నవీ పిళ్లైకి ఈ అత్యున్నత గౌరవం దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us