తాలిబన్ల నియంత్రణలో వెళ్లిన అప్గానిస్తాన్ దేశం రావణకాష్టంలా రగులుతోంది. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. గురువారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల వరుసగా జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలలో సుమారు 72 మంది మరణించారు. చనిపోయిన వారిలో 12 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. అలాగే మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు అమెరికా వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పెంటగాన్ స్పష్టం చేసింది. మొత్తంగా ఈ పేలుళ్లలో 143 మందికి తీవ్ర గాయాలైనట్లు ఆఫ్గాన్, అమెరికా అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చునని భావిస్తున్నారు.
కాబూల్ విమానాశ్రయం వెలుపల అబ్బే గేట్ వద్ద ఒక పేలుడు సంభవించగా.. కాసేపటికే అక్కడే సమీపంలో ఉన్న బేరన్ హోటల్ వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ రెండూ కూడా ఆత్మాహుతి దాడులని అమెరికా రక్షణశాఖ కార్యాలయ ప్రతినిధి జాన్ కిర్బి వెల్లడించారు. కాగా, కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పేలుడు సంభవించడం కలకలం సృష్టిస్తోంది.