AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!

భారత్ డిజిటల్ రంగంలో దూసుకుపోవాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో డేటా సెంటర్లు, ఏఐ క్లస్టర్లు భారీగా పెరగనున్నాయి. భారత్ ఆశలు భారీగానే ఉన్నాయి కానీ కరెంట్ సరిపోతుందా? ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్చరికతో ఈ అంశం తెరపైకి వచ్చి చర్చకు దారి తీసింది.

భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!
Elon Musk's Electricity Warning For India's Ai Ambition
Sharada V
|

Updated on: Aug 25, 2026 | 1:22 PM

Share

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా “ద ఎకనామిస్ట్” పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసారు.  “భారత్, అమెరికా, యూరప్ దేశాలన్నీ కలిపి ఎంత విద్యుత్  ఉత్పత్తి చేస్తున్నాయో… ఒక్క చైనా అంతకంటే ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తోంద”ని మస్క్ బాంబు పేల్చారు. దాంతో భారత్ తలపెట్టిన భారీ ఏఐ కలలకు కరెంట్ కోతలు పెద్ద అడ్డంకిగా మారనున్నాయా?  చైనాతో పోల్చితే భారత్ ఏఐ రేసులో వెనకబడనుందా అనే చర్చ ప్రస్తుతం తెర మీదికొచ్చింది.

ప్రపంచంలోని మొత్తం డేటా వినియోగంలో 20 శాతం భారత్ నుంచే జరుగుతోంది. కానీ మన దేశంలో మాత్రం ప్రపంచంలోని డేటా సెంటర్లలో కేవలం 5 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ అంతరాన్ని పూడ్చాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నితి ఆయోగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి భారత్‌లోని డేటా సెంటర్ల విద్యుత్ అవసరం ఏకంగా 16 గిగావాట్లకు చేరుకోవచ్చు. 2030 నాటికి కనీసం 10 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించారు.

విద్యుత్ లేకపోతే ఏఐ నడవదు!

అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. డేటా సెంటర్లు కేవలం పగటిపూట మాత్రమే పనిచేయవు. అవి రాత్రింబవళ్ళు 24 గంటలూ నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. సాధారణ కంప్యూటర్ల కంటే ఏఐ సర్వర్లకు వందల రెట్లు ఎక్కువ విద్యుత్ కావాలి. భారత్‌లో సాధారణ ప్రజల వాడుకకు కూడా కరెంట్ డిమాండ్ ఏటా 6.4 శాతం చొప్పున పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఏఐ కోసం అంత భారీగా కరెంట్ ఎక్కడి నుంచి తేవాలి?

పర్యావరణంపై పెనుభారం!

ఏఐ డేటా సెంటర్లు వాటి మౌలిక వసతుల వల్ల విద్యుత్తే కాదు, నీరు కూడా భారీగా ఖర్చవుతుంది. డేటా సెంటర్లను చల్లబరచడానికి లక్షలాది లీటర్ల నీరు అవసరం. ఇది  పర్యావరణంపై పెను భారం పడుతుందని అక్రోని సంస్థకు చెందిన అలోనా గెక్లర్ అన్నారు.  “ఏఐ ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయనడంలో సందేహం లేదు. కానీ దాని కోసం మనం చెల్లించాల్సిన పర్యావరణ మూల్యం చాలా పెద్దది. భవిష్యత్తులో ఏఐ ఎంత విలువను సృష్టిస్తుందనేది ముఖ్యం కాదు… దాని వల్ల దెబ్బతింటున్న పర్యావరణ నష్టాన్ని మనం ఎంతవరకు తగ్గించగలం అనేదే అసలు ప్రశ్న” అని హెచ్చరించారు.

భారతదేశంలో ఏఐ డేటా సెంటర్ల కోసం ప్రత్యేకంగా ఏ ఒక్క  పర్యావరణ చట్టం అంటూ ఏదీ లేదు. ప్రాజెక్ట్ పరిమాణం, స్థలాన్ని బట్టి కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతులు, భూగర్భ జలాల వాడకంపై నిబంధనలు వర్తిస్తాయి.

నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో వాటర్ కూలింగ్ సిస్టమ్స్ వాడితే అది ముప్పుగా మారుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలను తీసుకురావలసిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే, ఏఐ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడమే భారత్ ముందున్న ఏకైక మార్గం.

భారతదేశంలో ఏఐ భవిష్యత్తు అద్భుతంగా ఉన్నప్పటికీ,  విద్యుత్ ఇంకా వనరుల సంక్షోభాన్ని మనం ఎలా ఎదుర్కొంటామనే దానిపైనే దేశం అసలు విజయం ఆధారపడి ఉంది!

Follow Us