
కెన్యా రాజధాని నైరోబీకి ఉత్తర దిశగా ఉన్న ప్రసిద్ధ ‘లోయిసాబా వైల్డ్‌లైఫ్ రిజర్వ్’ నుంచి బుధవారం ఉదయం టూరిస్ట్ హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరింది. విమానంలో ఒక పైలట్ సహా మొత్తం ఆరుగురు పర్యాటకులు ఉన్నారు. కొండలు, కోనల మీదుగా సాగిపోతున్న ఆ ప్రయాణం సాఫీగానే సాగుతోందనుకున్న సమయంలో సెంబూరు కౌంటీ ప్రాంతానికి రాగానే పైలట్ కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ క్షణాల్లో నేలకూలి ధ్వంసమైంది! కాసేపటికే ఎత్తైన కొండ, అటవీ ప్రాంతంలో పొగలు రావడం గమనించారు స్థానికులు.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో ఈక్వడార్ దేశానికి చెందిన ఛీఫ్ ఇంటెలిజెన్స్ అధికారి, అతని భార్య, ఐదుగురు అమెరికన్ పర్యాటకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరు ఎంత భయానకంగా ఉందంటే… హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరూ బతికే అవకాశం లేకుండా పోయింది. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదంటూ కెన్యా ప్రమాద దర్యాప్తు శాఖ డైరెక్టర్ ఫెడ్రిక్ కబుంగే తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు.
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నించాయి. కానీ, ఆ ప్రాంతం అత్యంత సంక్లిష్టమైన దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో ఉండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. దానికి తోడు చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అసలు ప్రమాదానికి కారణం వాతావరణంలో మార్పులా? సాంకేతిక లోపమా? ఏంటనేది తెలియాల్సి ఉంది. మరో వైపు ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హఠాత్తుగా కూలడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ (KCAA) ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.