
ఎడారి మధ్యలో ఒయాసిస్సులా ఉండే అత్యాధునిక నగరం దుబాయ్. ఆ మహా నగరానికి పచ్చదనం అద్దుతోంది, అక్కడి మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా దుబాయ్‌లోని రోడ్లు, ముఖ్య కూడళ్లలో 3 లక్షల కంటే ఎక్కువ మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. దీంతో దుబాయ్‌లో గ్రీనరీ, 3 మిలియన్ చదరపు మీటర్లకు పైగా విస్తరించింది. గ్రీన్ దుబాయ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
లతీఫా బింట్ హమ్దాన్ స్ట్రీట్‌లోని అల్ ఖైల్ రోడ్, 7వ ఇంటర్‌చేంజ్ సమీపంలోని షేక్ జాయెద్ రోడ్, అల్ మినా రోడ్, షేక్ రషీద్ స్ట్రీట్, షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ స్ట్రీట్, అల్ అమర్ది స్ట్రీట్ లాంటి ప్రధాన మార్గాలను ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా చేసుకుంది. ఈ జోన్లలో 3 లక్షల కంటే ఎక్కువ మొక్కలను నాటారు. వాటితో పాటు సీజన్‌కు అనుగుణంగా వికసించే పూల మొక్కలను కూడా పెంచారు. ఈ మొక్కలకు నీళ్లు అందించడానికి, రిమోట్ పర్యవేక్షణతో భూగర్భ నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేశారు.
ఈ మొక్కల పెంపంకంతో దుబాయ్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక స్థానిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా మొక్కల ఎంపిక జరిగింది. స్థానిక వృక్షాలతో పాటు బోగన్‌విల్లా, మిల్లింగ్టోనియా, చోరిసియా, వాషింగ్టోనియా లాంటి పుష్పజాతుల మొక్కలను కూడా ఎంపిక చేసి నర్సరీల్లో పెంచి, ఆ తర్వాత వాటిని ప్రముఖ కూడళ్లలో నాటారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..