
థాయిలాండ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వారాంతంలో మద్యపానానికి సంబంధించిన కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆల్కహాలిక్ పానీయాల నియంత్రణ చట్టం ప్రకారం, నిర్ణీత సమయం లోపల మాత్రమే మద్యం సేవించాలి. అలాగే నిషేధిత ప్రాంతంలో మద్యం సేవిస్తే శిక్ష తప్పదు. ఇందుకోసం 10,000 థాయ్ బట్ (THB) అంటే సుమారు 27,000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు థాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం 1972 తర్వాత అత్యంత కఠినమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు, మద్యం దుకాణదారులు, బార్‌ల యజమానులు మాత్రమే కాకుండా, మద్యం సేవించే వినియోగదారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, గతంలో మద్యం అమ్మకాలకు సమయ పరిమితులు ఉండేవి. సూపర్ మార్కెట్లు లేదా దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకూడదు. కొత్త చట్టం ఇప్పుడు కస్టమర్లపై దృష్టి పెడుతుంది. దీని అర్థం ఎవరైనా తెల్లవారుజామున 1:59 గంటలకు మద్యం కొనుగోలు చేసి 2:05 గంటల వరకు తాగడం కొనసాగిస్తే, వారు ఇప్పటికీ ఉల్లంఘనదారులుగా పరిగణించి, జరిమానా విధించడం జరుగుతుంది. ఒక కస్టమర్ తెల్లవారుజామున 1:59 గంటలకు బీరు కొని 2:05 గంటల వరకు తాగితే, అది ఉల్లంఘన కిందకు వస్తుంది.
నైట్ లైఫ్, పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడిన దేశానికి, ఈ చర్య పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. రెస్టారెంట్ యజమానులు, హోటళ్ల యజమానులు, చట్టసభ్యులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇది సందర్శకులను భయపెట్టే ప్రమాదం ఉందని, చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. “కస్టమర్లను కట్టడి చేస్తున్నారు. ఇది రెస్టారెంట్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.” అని థాయ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చానన్ కోయెట్చారోయెన్ అన్నారు.
కాగా, కొత్త చట్టం ప్రకారం, లైసెన్స్ పొందిన వినోద వేదికలు, హోటళ్ళు, పర్యాటక ప్రదేశాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలలో మాత్రమే మద్యం అందించవచ్చు. మరెక్కడైనా మద్యం సేవించడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తామని థాయ్ సర్కార్ పేర్కొంది. అదనంగా, మద్యం ప్రమోషన్ కూడా నిషేధించింది సర్కార్. అంతేకాదు ప్రముఖులు, ప్రజాదర కలిగిన వ్యక్తుల ద్వారా వాణిజ్య ప్రమోషన్లు నిషేధించారు. అయితే “మద్యం సేవించేవారికి జరిమానా విధించే అవకాశం ఉన్నందున, ఆ సమయాల్లో మద్యం అమ్మకాలు సగానికి తగ్గవచ్చు” అని రెస్టారెంట్ నిర్వాహకులు అంటున్నారు. కొత్త ఆంక్షలు విదేశీ పర్యాటకులను గందరగోళానికి గురిచేస్తాయని, థాయిలాండ్ ఆతిథ్య ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని అంత్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..