Dr. Nawab Mir Nasir Ali Khah: డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అమెరికా కాంగ్రెస్ మెడలియన్, ప్రొక్లమేషన్

డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అమెరికా కాంగ్రెస్ మెడలియన్‌తో పాటు కాంగ్రెస్ ప్రొక్లమేషన్‌ను ప్రదానం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఈ గౌరవాలు అందజేశారు. అంతర్జాతీయ దౌత్యం, దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి.

Dr. Nawab Mir Nasir Ali Khah: డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అమెరికా కాంగ్రెస్ మెడలియన్, ప్రొక్లమేషన్
Dr. Nawab Mir Nasir Ali Khah Honoured

Updated on: Dec 13, 2025 | 4:22 PM

భారతీయుడైన డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అమెరికా కాంగ్రెస్ అత్యున్నత గౌరవాలను అందజేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కజకిస్తాన్ గౌరవ కాన్సుల్‌గా సేవలందిస్తున్న ఆయనకు… అమెరికా కాంగ్రెస్ మెడలియన్‌తో పాటు కాంగ్రెస్ ప్రొక్లమేషన్‌ను ప్రదానం చేశారు. ఈ అరుదైన గౌరవ కార్యక్రమం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో అధికారికంగా జరిగింది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు, ఇల్లినాయిస్ రాష్ట్రం ఫస్ట్ కాంగ్రెస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌మన్ జోనాథన్ ఎల్. జాక్సన్ ఈ పురస్కారాలను అందజేశారు. ఆయన అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీతో పాటు వ్యవసాయ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు.

సమాజ సేవ, అంతర్జాతీయ దౌత్యం, గ్లోబల్ అభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి మాత్రమే ప్రదానం చేసే కాంగ్రెస్ మెడలియన్‌ను డా. ఖాన్‌కు అందజేయడం విశేషం. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ సేవలకు గుర్తింపుగా ఇచ్చే కాంగ్రెస్ ప్రొక్లమేషన్‌ను కూడా ఆయనకు మంజూరు చేశారు. ఈ ప్రొక్లమేషన్ అమెరికా కాంగ్రెస్ అధికారిక రికార్డుల్లో శాశ్వతంగా నమోదు కానుంది.

“దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ సహకారం, సుస్థిర అభివృద్ధి, వాణిజ్య సంబంధాల పెంపులో ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. ఈ గౌరవాలను ఆయనకు అందజేయడం గర్వకారణం” అని ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్‌మన్ జోనాథన్ ఎల్. జాక్సన్ వ్యాఖ్యానించారు.

అమెరికా, కజకిస్తాన్, భారత్‌ల మధ్యతో పాటు ప్రపంచ దేశాల మధ్య శాంతి, ఆర్థిక సహకారం, సార్థక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో డా. ఖాన్ పాత్ర కీలకమని కాంగ్రెస్‌మన్ జాక్సన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.


“అమెరికా కాంగ్రెస్ మెడలియన్, ప్రొక్లమేషన్ అందుకోవడం నా జీవితంలో చిరస్మరణీయ ఘట్టం. ఈ గౌరవం అంతర్జాతీయ సహకారం, ప్రపంచ పురోగతికి మరింత కట్టుబడి పనిచేయాలనే బాధ్యతను నాకు మరింత పెంచింది” అని క్యాపిటల్ హిల్‌లో జరిగిన కార్యక్రమంలో డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ చెప్పారు.

ఇదే సమయంలో గ్లోబల్ ఐ మ్యాగజిన్ (USA) ఆధ్వర్యంలో ప్రకటించిన గ్లోబల్ డిప్లొమాట్ అవార్డు–2025కు కూడా డా. ఖాన్ ఎంపిక కావడం విశేషం. అంతర్జాతీయ దౌత్యం, భాగస్వామ్య దేశాల మధ్య సహకారం పెంపులో ఆయన పోషిస్తున్న కీలక పాత్రకు ఇది మరో గుర్తింపుగా నిలిచింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.