
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈసారి చట్టసభ సభ్యులే లక్ష్యంగా కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు చట్టసభ సభ్యులే లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇద్దరు డెమోక్రాటిక్-ఫార్మర్-లేబర్ పార్టీ శాసనసభ్యులపై.. వారి ఇళ్లలోనే దుంగడులు కాల్పులు జరిపారు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో మిన్నెసోటా స్టేట్ రిప్రజెంటేటివ్, హౌజ్ స్పీకర్ మెలిస్సా హర్ట్‌మన్, ఆమె భర్త మార్క్ మృతి చెందారు. స్టేట్ సెనెటర్ జాన్ హఫ్‌మన్, ఆయన సతీమణిపైనా కాల్పులు జరపగా.. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీటిని రాజకీయ హత్యలుగా అనుమానిస్తున్నామని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ వెల్లడించారు.
చట్టసభ సభ్యులపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇవి భయంకరమైన హింసగా అభివర్ణించారు. రాష్ట్ర శాసనసభ్యులపై లక్ష్యంగా జరిగిన దాడిగా ఈ కాల్పులు కనిపిస్తున్నాయని, ఈ భయంకరమైన హింసను సహించబోమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు శాసనసభ్యుల ఇళ్లలోకి ప్రవేశించేందుకు పోలీస్ అవతారం ఎత్తినట్లు అనుమానిస్తున్నారు.
SUV స్క్వాడ్ కారులా కనిపించే వాహనాన్ని వినియోగించాడని.. దీనిపై లైట్లు, అత్యవసర లైట్లు అమర్చబడి సరిగ్గా పోలీస్ వాహనం లాగే ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అనుమానితుడి వాహనంలో ఇంక అనేకమంది శాసనసభ్యుల ఫొటోలు, ప్రభుత్వ అధికారుల లిస్టు దొరికింది. ఇది వారిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
అయితే.. కొద్దిరోజుల క్రితమే నేతలను స్థానిక పోలీసులు అప్రమత్తంచేశారు.. అయినప్పటికీ.. దుండగుడు పోలీసుల పేరుతో వచ్చి కాల్పులు జరపడం కలకలం రేపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..