North Korea: ఉత్తర కొరియాలో కరోనా ఉగ్రరూపం.. భయాందోళన కలిగిస్తున్న పరిస్థితులు

|

May 15, 2022 | 12:41 PM

రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా(Corona) మహమ్మారి.. ఉత్తర కొరియాపై పంజా విసురుతోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడి అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళన...

North Korea: ఉత్తర కొరియాలో కరోనా ఉగ్రరూపం.. భయాందోళన కలిగిస్తున్న పరిస్థితులు
Corona
Follow us on

రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా(Corona) మహమ్మారి.. ఉత్తర కొరియాపై పంజా విసురుతోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడి అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు వైరస్ ఆనవాళ్లు లేవని చెప్పుకున్న రాజ్యం ఇప్పుడు మహమ్మారి కోరల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటోంది. కరోనా వైరస్ కారణంగా శనివారం మరో 15 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ దేశంలో కొత్తగా 2,96,180 మందిలో వైరస్‌ లక్షణాలతో కూడిన జ్వరాలను గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో 8,20,620 మంది కరోనా బారిన పడ్డారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయికి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరకొరియా (North Korea)లో క్షేత్రస్థాయి ఆరోగ్య వ్యవస్థలు దశాబ్దాలుగా చాలా బలహీనంగా ఉన్నాయి. పైగా మహమ్మారి ప్రవేశాన్ని నిలువరించడంలో భాగంగా ఆ దేశం విదేశాలతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకొంది. దీంతో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించడానికి కావాల్సిన కనీస కిట్లు కూడా లేవని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మహమ్మారి (Pandemic) భారీ ఎత్తున వ్యాప్తి చెందితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఉత్తరకొరియా ప్రభుత్వం మాత్రం మహమ్మారి వ్యాప్తి కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. దాదాపు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తల్ని రంగంలోకి దింపినట్లు పేర్కొంది. భారీ ఎత్తున ఐసోలేషన్‌ కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది.

ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు సహా మహమ్మారి అదుపునకు కావాల్సిన ఇతర సాయాన్ని అందించడానికి చైనా, దక్షిణ కొరియా ముందుకు వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు కిమ్‌ సర్కార్‌ మాత్రం వాటిని అంగీకరించడానికి అధికారికంగా ముందుకురాలేదు. దేశవ్యాప్తంగా అక్కడి ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో ఆంక్షలు పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

ఇవి కూడా చదవండి

CNG Price Hike: వాహనదారులకు షాక్‌.. పెరిగిన CNG ధర.. ప్రధాన నగరాల్లో కొత్త రేట్ల వివరాలు