AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురుషులకు తెలియని మహిళల ప్రత్యేక లిపి నుషు!

Nushu:  గతంలో మహిళలకు చదువుకునే అవకాశం ఉండేది కాదు. మనసులోని భావాలను, బాధలను తోటి మహిళలతో పంచుకోవడానికి  పరిమితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో చైనా మహిళలు తమకంటూ ఒక ప్రత్యేకమైన లిపిని సృష్టించుకున్నారు. పురుషులకు తెలియని ఈ లిపి ద్వారా తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకునేవారు. కనుమరుగయ్యే దశకు చేరుకున్న ఆ ప్రత్యేక లిపిని ఇప్పుడు ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పురుషులకు తెలియని మహిళల ప్రత్యేక లిపి నుషు!
China's Women Only Writing System Nushu Finds New Life Today
Sharada V
|

Updated on: Oct 29, 2026 | 5:50 PM

Share

Nushu:  గతంలో మహిళలకు చదువుకునే అవకాశం ఉండేది కాదు. మనసులోని భావాలను, బాధలను తోటి మహిళలతో పంచుకోవడానికి  పరిమితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో చైనా మహిళలు తమకంటూ ఒక ప్రత్యేకమైన లిపిని సృష్టించుకున్నారు. పురుషులకు తెలియని ఈ లిపి ద్వారా తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకునేవారు. కనుమరుగయ్యే దశకు చేరుకున్న ఆ ప్రత్యేక లిపి ఇప్పుడు మళ్లీ ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఇంతకీ ఆ లిపి ప్రత్యేకత ఏంటి? దాన్ని మళ్లీ ఎందుకు నేర్చుకుంటున్నారు?

మహిళల కోసమే ప్రత్యేక లిపి.. అదే నుషు!

చైనా గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు మహిళలు ఉపయోగించిన ప్రత్యేక లిపి ‘నుషు’. ప్రపంచంలో మహిళలే ప్రత్యేకంగా రూపొందించి, ఉపయోగించిన ఏకైక లిపి నుషు. గతంలో చైనా సంప్రదాయ సమాజంలో మహిళలకు విద్య, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. ఎక్కువ మంది మహిళలు ఇంటికే పరిమితమయ్యేవారు. అలాంటి సమయంలో తమ భావాలను వ్యక్తపరచడానికి, మనసులోని మాటలను ఇతరులతో పంచుకోవడానికి అక్కడి మహిళలు నుషు లిపిని ఉపయోగించడం ప్రారంభించారు. 19వ శతాబ్దంలో ఈ లిపి మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. హాన్, యావో, మియావో వర్గాలకు చెందిన మహిళలు దీన్ని ఉపయోగించేవారు.

పురుషులకు తెలియని రహస్య భాష!

నుషు లిపిలోని అక్షరాలు సాధారణ చైనీస్ అక్షరాల్లా ఉండవు. అవి సన్నగా, వజ్రాకారాన్ని పోలిన ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తాయి. ఈ లిపిని మహిళలే ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేవారు. పురుషులకు దీన్ని నేర్పించేవారు కాదు. దీంతో మహిళలు తమ వ్యక్తిగత విషయాలను స్వేచ్ఛగా రాసుకునే అవకాశం లభించేది. నుషు మహిళల భావోద్వేగాలకు ఒక మార్గంగా నిలిచింది. తమ జీవితాల్లోని కష్టాలు, బాధలు, కుటుంబ సమస్యలను ఈ లిపిలో రాసుకునేవారు. కవితలు, జానపద పాటలు, వ్యక్తిగత సందేశాలను కూడా నుషు ద్వారా ఒకరికొకరు పంపించుకునేవారు. తల్లీ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు, సన్నిహిత స్నేహితుల మధ్య ఈ లిపి ఒక బంధంలా పనిచేసేది. తమ బాధలను పంచుకోవడంతో పాటు, కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి  ఉపయోగపడేది.

తరం నుంచి తరానికి ఎలా అందింది?

నుషు లిపిని మహిళలు తమ ఇళ్లలోనే నేర్చుకునేవారు. తల్లులు కూతుళ్లకు లిపిని రాయడం, చదవడం  నేర్పించేవారు. ఇలా ఒక తరం నుంచి మరో తరానికి ఆ లిపి అందుతూ వచ్చింది. అయితే 20వ శతాబ్దంలో వచ్చిన మార్పులు, పాత సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవడం వంటి కారణాలతో నుషు వినియోగం తగ్గింది.  ప్రత్యేకమైన లిపి అంతరించే ప్రమాదం ఏర్పడింది.

మళ్లీ ప్రాచుర్యంలోకి నుషు.. కారణమేంటి?

కాలగర్భంలో కలిసిపోతున్న నుషు లిపిని కాపాడేందుకు ప్రస్తుతం చరిత్రకారులు, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. చైనాలోని పువేయ్ అనే చిన్న గ్రామం ఈ ప్రయత్నాలకు కేంద్రంగా మారింది. 200 మంది నివసించే ఈ గ్రామంలో నుషు లిపిని రాయగల ముగ్గురు మహిళలను పరిశోధకులు గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంపై నుషు పరిశోధకుల దృష్టి పడింది. జియాంగ్‌యోంగ్ ప్రాంతంలోని జియావో నది దాటి ఈ గ్రామానికి వెళ్లాలంటే వేలాడే వంతెన దాటాల్సి ఉంటుంది.

పువేయ్ గ్రామంలో నుషు పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ  పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నుషు నేర్చుకోవాలనే ఆసక్తితో యువత కూడా ముందుకు వస్తున్నారు. ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, కాలిగ్రఫీ తరగతులు నిర్వహిస్తూ పురాతన సంప్రదాయాన్ని కొత్త తరాలకు పరిచయం చేస్తున్నారు.

పాఠశాలల్లోనూ నుషు పాఠాలు!

నుషు లిపికి చైనా జాతీయ సాంస్కృతిక వారసత్వ జాబితాల్లో స్థానం కల్పించారు.  మ్యూజియంలో దీని గురించి వివరాలను అందుబాటులో ఉంచారు.  చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ లిపి గురించి తెలియచేయాలని  పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు . ఒకప్పుడు మహిళలు తమ మనసులోని మాటలను చెప్పుకోవడానికి ఉపయోగించిన నుషు అంతరించిపోయే దశకు చేరుకున్నా నుషు లిపిని మళ్లీ బతికించేందుకు ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తున్నాయి.

Follow Us