భారత దేశంలోని విద్యుత్ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడులు చేయడాన్ని అమెరికా ఖండించింది. ఈ విధమైన దాడులను సహించరాదని ఫ్రాంక్ పాలోన్ అనే ఎంపీ కోరారు. ఇలాంటి తరుణంలో జోబైడెన్ ప్రభుత్వం ఇండియాకు అండగా నిలబడాలని ఆయన ట్వీట్ చేశారు. మన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు మనం ఈ సమయంలో సపోర్ట్ గా ఉండాలని అన్నారు. భారత విద్యుత్ గ్రిడ్లపై ప్రమాదకరమైన చైనా హ్యాకర్ల దాడులు గర్హనీయమని, అసలే కోవిడ్ పాండమిక్ బలంగా ఉన్న సమయంలో చైనా చర్యల కారణంగా ఇండియాలో హాస్పిటల్స్ పని చేయక మూత పడవలసి వచ్చిందని, జనరేటర్లు సైతం పని చేయలేదని,, బైడెన్ ప్రభుత్వం ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. బలప్రయోగం, బెదిరింపుల ద్వారా చైనా ఆసియా ప్రాంతంపై డామినేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను మనం అనుమతించరాదని ఫ్రాంక్ పాలోన్ కోరారు.
మసాచ్యూసెట్స్ లోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ చైనా నిర్వాకాన్ని ఎండగట్టింది. మాల్ వేర్ ద్వారా ఇండియాలోని విద్యుత్ గ్రిడ్ సిస్టంలలోకి చైనా ప్రభుత్వంతో లింక్ గల హ్యాకర్లు టార్గెట్ చేయడాన్ని ఈ సంస్థ గుర్తించింది. కాగా ఈ వార్తల గురించి తమకు కూడా తెలుసునని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మాల్ వేర్ ఉదంతంపై న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన స్టడీ వార్తను తాము కూడా చూశామన్నారు. చైనా చర్యలను సహించబోమని, సైబర్ సెక్యూరిటీ, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సప్లయ్ ఛైన్ సెక్యూరిటీ ప్రాధాన్యాన్ని మేం గుర్తించామని ఆయన చెప్పారు.
అటు- చైనా హ్యాకర్లు సీరం, భారత్ బయో టెక్ సంస్థలను కూడా టార్గెట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా చైనా ఇప్పటివరకు తమ హ్యాకర్ల నిర్వాకంపై నోరు మెదపలేదు. ఇంత పెద్ద ఉదంతం జరిగి తమదేశంపై ఆరోపణలు వచించినా స్పందించలేదు.
మరిన్ని చదవండి ఇక్కడ :
Breaking News :పాకిస్తాన్ లో అత్యవసరంగా దిగిన భారత విమానం, ఎందుకంటే ?