బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. ఆ దేశంలో తొలిసారిగా కోవిడ్ మరణాల సంఖ్య 4,000లను అధిగమించింది. 24 గం.ల వ్యవధిలో ఆ దేశంలో 4000లకు పైగా కోవిడ్ మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక కోవిడ్ బులెటిన్ మేరకు మంగళవారం ఆ దేశంలో 4,195 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3,36,947కు చేరుకుంది. 24 గం.ల వ్యవధిలో 4 వేలకు పైగా కోవిడ్ మరణాలు నమోదైన మూడో దేశం బ్రెజిల్. ఇప్పటి వరకు అమెరికా, పెరూలో మాత్రమే 4 వేలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
బ్రెజిల్‌లో అత్యధిక జనాభా నివసిస్తున్న సావో పాలో రాష్ట్రంలో ఆ దేశంలోనే అత్యధికంగా 1,400 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కరోనా మరణాల సంఖ్య పెరగడంతో కొన్ని శ్మశాన వాటికల వద్ద రాత్రిపూట కూడా ఖననం చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతివ్వడం తెలిసిందే. బ్రెజిల్‌లో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్ చివరి నాటికి ఆ దేశంలో రోజువారీ కోవిడ్ మరణాల సంఖ్య 5,000లకు చేరే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
మొదటి నుంచే కరోనా కట్టడికి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకు దేశంలో కరోనా తీవ్రతను బోల్సోనారో అంగీకరించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లు కరోనా, నిరుద్యోగ సమస్యలుగా పేర్కొన్నారు. త్వరలోనే ఈ రెండు సమస్యలపైనా విజయం సాధిస్తామని గత వారం ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి..RBI: పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. డిపాజిట్ పరిమితిని ఆర్‌బీఐ ఎంత పెంచిందంటే..?
Food Officers Raid: బిర్యానీ పార్సిల్ తీసుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడండి.