
ఈమధ్య కాలంలో బాంబు బెదిరింపులు సర్వ సాధారణం అయిపోయాయి. మొన్నటి వరకూ మన దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ బాంబు బెదిరింపులు వినిపించాయి. అలాగే పలు ప్రధాన ఎయిర్ పోర్టులను కూడా పేల్చేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు కూడా బాంబు బెదిరింపులు తప్పడం లేదు. ఆ దేశంలోని పలు రాష్ట్రాల రాజధానుల్లోని స్టేట్ హౌజ్ భవనాలను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఇలా బెదిరింపులు వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. హుటాహుటిన అక్కడ సంచరిస్తున్న ప్రజలను ఖాళీ చేయించారు. కొన్ని వ్యాపార సముదాయాలను మూసి వేయించారు.
మరోవైపు అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ సంస్మరణ ర్యాలీలో భారీ పేలుడు జరిగిన విషయం మరువక ముందే ఇలాంటి బెదిరింపులు రావడం అందరిలో కొంత ఆందోళన కలిగిస్తోంది. తమ దేశంలో జరిగిన ఘటన వెనుక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో అమెరికా క్యాపిటల్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడం చర్చనీయాంశమైంది.
కనెక్టికట్, జార్జియా, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, మిస్సిస్సిప్పి, మిచిగాన్, మోంటానా స్టేట్‌హౌస్ కార్యాలయాలకు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని ఆగంతకులు ఓ ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఆయా కార్యాలయాలకు బెదిరింపు సందేశాలు పంపించారు. ఈ మెయిల్ ఐడీపై దర్యాప్తు చేపట్టింది ప్రత్యేక బృందం. దీంతో ఆయా క్యాపిటల్ భవనాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ బృందాలు బరిలో దిగాయి. ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. అయితే.. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకూ ఎలాంటి పేలుళ్లకు సంబంధించిన పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..