ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్ ఎక్కవయ్యాయి. విమానంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. తాజాగా మాస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.400 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన ఒక విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ సీఐఎస్‌ఎఫ్‌కు గత అర్ధరాత్రి ఈ-మెయిల్ వచ్చింది. ఈ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది. బెదిరింపుల నేపథ్యంలో అంతకుముందే ఎయిర్‌పోర్టులో భద్రతను పెంచారు. విమానం ల్యాండ్ అవగానే అందులోని 386 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి.. విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
భారత గగనతలంలోకి వచ్చిన ఓ ఇరాన్ విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే ఇటీవల కాలంలో వచ్చిన విషయం తెలిసిందే. భారత గగనతలం మీదుగా ఎగురుతున్న ఇరాన్ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందడంతో.. అధికారులు హుటాహుటిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. భారత వాయుసేనకు చెందిన రెండు ఫైటర్ జెట్లు ఆ విమానాన్ని అనుసరించాయి . బెదిరింపుల నేపథ్యంలో ఆ విమానాన్ని జైపుర్ లేదా చండీగఢ్‌లో దించాలని అధికారులు పైలట్లకు సూచించారు. ఫైలట్లు నిరాకరించడంతో ఆ విమానం భారత గగనతలం వదిలి చైనా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ విమానంలో ఎటువంటి బాంబు లేదని తెలిసింది.
తాజాగా మాస్కో నుంచి వచ్చిన విమానంలో కూడా అధికారులు తనిఖీలు చేపట్టగా అందులోనూ బాంబు లేదా ఇరత ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణీకులతో పాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..