సముద్రంలో మునిగిపోయిన పర్యాటకుల బోటు.. ఏపీ, తెలంగాణ వాసుల గల్లంతు..!

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వియత్నామీస్ యంత్రాంగం వేగంగా స్పందించింది. విస్తృతస్థాయిలో సహాయక మరియు గాలింపు చర్యలను చేపట్టింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సముద్రంలో మునిగిపోయిన పర్యాటకుల బోటు.. ఏపీ, తెలంగాణ వాసుల గల్లంతు..!
Boat Capsized

Updated on: Jul 11, 2026 | 4:30 PM

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వియత్నామీస్ యంత్రాంగం వేగంగా స్పందించింది. విస్తృతస్థాయిలో సహాయక, గాలింపు చర్యలను చేపట్టింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతులలో ఎంతమంది భారతీయులు ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ఆ పడవలో 24 మంది భారత పౌరులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి 105 మంది పర్యాటకులు వియత్నాం సందర్శనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ పడవలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు, తమిళనాడుకు చెందిన 17 మందితో సహా సుమారు 24 మంది ప్రయాణిస్తున్నారని శ్రీనివాస్ అనే పర్యాటకుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు క్షేమంగా ఉండగా, ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చారు. అలాగే తమిళనాడుకు చెందిన పలువురు కూడా ఆసుపత్రి పాలయ్యారు.

మరోవైపు, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. బాధిత భారతీయుల వివరాల కోసం, వారికి తక్షణ సహాయం అందించడం కోసం స్థానిక అధికారులతో రాయబార కార్యాలయం నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. “వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో కొద్ది గంటల క్రితం భారతీయ పర్యాటకులతో కూడిన పడవ బోల్తా పడిన విషాద ఘటన జరిగింది. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు” అని రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ‘X’ ద్వారా అధికారికంగా ధృవీకరించింది.

బాధిత పర్యాటకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే, అవసరమైన వైద్య, రవాణా సహాయాన్ని సమకూర్చేందుకు భారత రాయబార కార్యాలయం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకోసం హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచారం కోసం +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పాటు హనోయిలో కూడా మరో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దాని కోసం +84 91 308 9165 నంబర్‌ను అందుబాటులో ఉంచారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. వర్షం పడనప్పటికీ, సముద్రపు అలల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర పర్యాటక పడవలు మానవత్వంతో స్పందించి రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. ఒక పడవ నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం.. పడవ బోల్తా పడిన ఐదు నిమిషాల్లోనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, చాలా మంది పర్యాటకులు బోల్తా పడిన పడవ లోపలే చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. కొంతమందిని మాత్రమే స్పృహతో ఉన్న స్థితిలో బయటకు తీయగలిగారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందని సమాచారం. భద్రతా సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేశారు..

Follow Us