
Bangladesh Power Crisis: ఉక్రెయిన్ యుద్ధ ప్రభావానికి తోడు, పెరుగుతున్న ఇంధన ధరలు, విదేశీ కరెన్సీ నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో విద్యుత్తు వినియోగానికి తగ్గించుకోవడానికి బంగ్లాదేశ్ కీలక చర్యలు చేపట్టింది. అక్కడ గత కొద్ది నెలలుగా పెరుగుతన్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ లో 50% పైగా ఇంధన ధరలు పెరిగాయి. ఈక్రమంలో శ్రీలంక పరిస్థితుల బంగ్లదేశ్ కు ఎదురవుతాయనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈదశలో సంక్షభ పరిస్థితులను నియంత్రించడానికి షేక్ హసీనా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ లో గత కొద్ది రోజులుగా విద్యుత్తు కోతలు పెరగడంతో ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. మరోవైపు విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడానికి పాఠశాలలకు వారంలో అదనంగా ఒక రోజు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే ప్రతి శుక్రవారం బంగ్లాదేశ్ లో పాఠశాలలకు వారాంతపు సెలవు కాగా.. ఇక నుంచి శుక్రవారంతో పాటు శనివారం కూడా సెలవుగా ప్రకటించింది. ఈశనివారం నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తుంది.
ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు పనివేళల్లోనూ మార్పులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల పనిగంటలు బంగ్లాదేశ్ లో 8 గంటలకు కాగా.. ఈసమయాన్ని ఒక గంట కుదిస్తూ.. 7 గంటలు మాత్రమే పనిచేసేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇన్ని చర్యలు చేపడుతున్నా.. బంగ్లాదేశ్ కూడా రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవల్సి వస్తుందని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసిన ప్రభుత్వం, ప్రయివేట్ కార్యాలయాలు వారి అనుకూలతను బట్టి షెడ్యూల్ తయారుచేసుకుని.. విద్యుత్తు ఆదాకు సహకరించాలని షేక్ హసీనా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వివిధ వస్తువుల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఇంధనం, ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బంగ్లాదేశ్ లో విదేశీ కరెన్సీ నిల్వలు క్షిణిస్తున్నాయి.
అధిక ధరలకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో నిరసనలు మిన్నంటాయి. ఈసందర్భంగా అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఇక్కడ ధరలు పెరిగాయని, అంతర్జాతీయంగా ధరలు తగ్గితే.. దాని ఆధారంగా దేశీయంగా ధరలను సర్దుబాటు చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. డీజిల్ తో నడిచే పవర్ ప్లాంట్ల కార్యాకలాపాలను షేక్ హసీనా ప్రభుత్వం నిలిపివేసి, రోజు వారీ విద్యుత్తు ఉత్పత్తిని 1000 మెగావాలట్లు తగ్గించుకుంది. ఈనిర్ణయం తర్వాత దేశంలో తరచూ విద్యుత్తు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇంధన రంగంలో నష్టాలను, అవినీతిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈక్రమంలో విదేశీ మారక నిల్వలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే, విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకోవడానికి గల అవకాశాలను ఉపయోగించుకుంటోంది షేక్ హసీనా ప్రభుత్వం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..