Anti Hijab Protest: శాంతించని ఇరాన్.. ఆందోళనకారుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం..

|

Oct 30, 2022 | 9:36 AM

ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నప్పటికి మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనలు మరింత తీవ్ర మయ్యాయి. హిజాబ్‌ వద్దే వద్దు అంటూ రాజధాని టెహ్రాన్‌తో పాటు..

Anti Hijab Protest: శాంతించని ఇరాన్.. ఆందోళనకారుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం..
Anti Hijab Protest
Follow us on

హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ భగ్గుమంటోంది. మహిళలను అణచివేస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు కదంతొక్కుతున్నారు. అక్కడి నారీ లోకం చేపడుతున్న ఆందోళనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్‌లో అమలులో ఉన్న షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్‌ ధరించాలి. దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ నిబంధనను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు ఈ ఏడాది జులైలో ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్‌ను ఉల్లంఘించే మహిళలను జరిమానాలతో పాటు అరెస్టుచేసేందుకు ఆదేశాలిస్తూ ఇందు కోసం ప్రత్యేకంగా ‘మొరాలిటీ పోలీసు’ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకరంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. కాగా మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ధరించలేదని ఇరాన్ లోని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆ తరువాత ఆ యువతి మరణించింది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన దాడుల్లో వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.

ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నప్పటికి మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనలు మరింత తీవ్ర మయ్యాయి. హిజాబ్‌ వద్దే వద్దు అంటూ రాజధాని టెహ్రాన్‌తో పాటు మషద్‌, ఖొరామాబాద్‌, సనందాజ్‌, షిరాజ్‌, జహెదాన్‌ తదితర కీలక నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. 1979లో జరిగిన ఇస్లామిక్‌ విప్లవం తర్వాత ఇరాన్‌లో జరుగుతున్న అతిపెద్ద ప్రజా ఉద్యమంగా దీనిని చెప్పుకోవచ్చు. మహ్సా అమిని మరణించి 40 రోజులు గడచిపోయినా నిరసనలు మాత్రం తగ్గడం లేదు. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.

ఆందోళకారులను అడ్డుకునేందుకు రివల్యూషనరీ గార్డ్స్, పోలీసులు ప్రయత్నించడం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా బలగాలను జనం నిలదీస్తున్నారు..
రెండు రోజుల క్రితం మహ్సా అమినికి నివాళులు అర్పించేందుకు షిరాజ్‌ నగరంలోని ఆమె సమాధిని సందర్శించిన ఆందోళనాకారులపై జరిగిన కాల్పుల్లో దాదాపు 15 మంది మరణించారు. తాజాగా జహెదాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చూస్తే ర్యాలీ నిర్వహించిన ఆందోళనాకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలునితో సహా ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.. ఇరాన్‌ వ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన అల్లర్లలో దాదాపు 250 మంది వరకూ మరణించి ఉంటారని అంఛనా.. ఈ ఆందోళనల వెనుక అమెరికా, ఇజ్రాయెల్‌, ఇంగ్లండ్‌ దేశాలున్నాయని, సౌదీ ఆరేబియా రెచ్చగొడుతోందని ఇరాన్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నా ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..