AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్..! 100% టారిఫ్ ఫ్లాన్‌.. అమెరికా సెనేట్ ఆమోదం!

రష్యాపై అమెరికా ఆంక్షల యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే కీలక బిల్లును అమెరికా సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదించింది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’గా పిలుస్తున్న ఈ బిల్లు 86-11 ఓట్లతో ఆమోదం పొందింది.

భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్..! 100% టారిఫ్ ఫ్లాన్‌.. అమెరికా సెనేట్ ఆమోదం!
Us Senate Passes Russia Sanctions Bill
Balaraju Goud
|

Updated on: Aug 08, 2026 | 7:27 AM

Share

రష్యాపై అమెరికా ఆంక్షల యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే కీలక బిల్లును అమెరికా సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదించింది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’గా పిలుస్తున్న ఈ బిల్లు 86-11 ఓట్లతో ఆమోదం పొందింది.

చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు, సహజవాయువును అత్యధికంగా కొనుగోలు చేసే ఐదు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై గరిష్ఠంగా 100 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్‌ సర్కార్‌కు లభిస్తుంది. ఈ జాబితాలో భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులు ఉన్నారు. అయితే సుంకాలు వెంటనే అమల్లోకి రావు. ముందుగా అమెరికా ప్రతినిధుల సభ బిల్లును ఆమోదించాలి. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ట్రంప్ ఈ అధికారాన్ని వినియోగించగలరు.

రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి మాస్కోకు లభిస్తున్న ఆర్థిక మద్దతును దెబ్బతీయడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశంగా అమెరికా చెబుతోంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా మాస్కోపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాలని వాషింగ్టన్ భావిస్తోంది.

ఈ బిల్లులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఉన్నతాధికారులు, సైనిక నాయకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలపై కఠిన ఆంక్షలకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తున్న ‘షాడో ఫ్లీట్‌’పై చర్యలకు కూడా అవకాశం కల్పిస్తోంది.

మరోవైపు ఇరాన్‌పైనా అమెరికా ఒత్తిడి కొనసాగనుంది. ఇరాన్ ఇంధన, ఆయుధ రంగాలకు సంబంధించిన ఆంక్షలను కొనసాగించే నిబంధనలు కూడా బిల్లులో ఉన్నాయి. దీంతో రష్యాతో పాటు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి మరింత పెరగనుంది.

అయితే ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారం ఇవ్వడంపై అమెరికాలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డెమోక్రటిక్ నేతలు గ్రెగరీ మీక్స్, డాన్ బేయర్ ఈ నిబంధనలు అధ్యక్షుడికి విస్తృత అధికారాలను ఇస్తాయని, వాటిని భవిష్యత్తులో ఇతర దేశాలపై కూడా ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ సుంకాల ప్రభావం చివరకు అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడు అందరి దృష్టి అమెరికా ప్రతినిధుల సభపైనే ఉంది. సభ కూడా బిల్లును ఆమోదిస్తే రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే కొత్త ఆయుధం ట్రంప్ చేతుల్లోకి వస్తుంది. అదే జరిగితే భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us