US Missiles to Ukraine: రష్యాను అడ్డుకునే దిశగా ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ లాంఛర్స్ ఇస్తోంది అమెరికా. అయితే, వీటి వినియోగంపై ఊహించని కండీషన్ పెట్టింది. అమెరికా.. మరి ఆ రాకెట్ లాంఛర్స్ ఎందుకిచ్చినట్లు.. ఎందుకు కండీషన్ పెట్టినట్లు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రష్యా దూకుడుగా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ పట్టు కాస్త సడలింది. డాన్‌బాస్క్‌తో పాటు పలు ప్రాంతాలు ఇప్పటికే పుతిన్ సేన స్వాధీనంలోకి వచ్చాయి. మరింతగా దూసుకొస్తున్న రష్యన్ ఆర్మీని నిలువరించేందుకు అత్యాధునిక ఆయుధాలివ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తికి స్పందించింది అగ్రరాజ్యం. ఇందులో భాగంగానే.. అత్యాధునిక హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ ఉక్రెయిన్‌కు అందించాలని నిర్ణయించారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. 700 మిలియన్ డాలర్ల వెపన్ ప్యాకేజీని ప్రకటించారు. అయితే ఈ రాకెట్లతో రష్యా భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని షరత్ విధించింది అమెరికా. తాము నాటో-రష్యా మధ్య యుద్ధాన్ని కోరుకోవడంలేదని స్పష్టం చేశారు.
అమెరికా ఉక్రెయిన్‌కు అందించే హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్‌ను ఎం142 రాకెట్ వ్యవస్థలు అంటారు. ఒక సారి దాడి చేశాక.. వీటిని శత్రువు పసిగట్టి ఎదురు దాడి చేయకుండా.. అక్కడి నుంచి వేగంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. 186 నుంచి 310 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. మరోవైపు ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ ఆయుధాలు ఇచ్చే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు రష్యా విదేశాంగశాఖా మంత్రి సెర్గీ లావ్రోవ్. ఉక్రెయిన్ తన సరిహద్దులు దాటి దాడులు చేస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారాయన.