
హెచ్-1బీ వీసా అంటే లక్షలాది మంది భారతీయులకు అమెరికన్ కల. కానీ ఆ కలను నిజం చేసుకున్న వారికి ఇప్పుడు కొత్త సవాల్ వచ్చిపడింది. అమెరికన్ల కంటే తక్కువ వేతనానికి పని చేస్తున్నారంటూ హెచ్-1బీ వీసాదారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న ట్రంప్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తే విదేశీ ఉద్యోగులకు వచ్చే ప్రమాదం ఏంటి..?
ఐటీ సంస్థల్లో విదేశీ ఉద్యోగులను తగ్గించి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అమెరికా మరో నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే హెచ్-1బీ వీసాదారుల వేతనాల పెంపునకు సంబంధించి కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే హెచ్-1బీ వీసాదారుల కనీస వార్షిక వేతనం 14వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని సుదీర్ఘంగా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధికారులు కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు.
ప్రస్తుతం అమెరికాలో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే హెచ్-1బీ వీసాదారులు సగటున 10,191 డాలర్లు తక్కువగా వార్షిక వేతనం అందుకుంటున్నారు. ముఖ్యంగా కంప్యూటర్, ఐటీ రంగాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. వాస్తవానికి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతుల కోసం హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. కానీ, అందుకు భిన్నంగా కొన్ని కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగం చేసి తక్కువ వేతనం తీసుకునే ఉద్యోగులను విదేశాల నుంచి నియమించుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన హెచ్-1బీల్లో 63శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగస్థులే ఉన్నట్లు కార్మికశాఖ గణాంకాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వేతన పెంపు ప్రతిపాదనలు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడి సంతకం తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.
కార్మిక శాఖ ప్రతిపాదనల ప్రకారం నాలుగంచెల వేతన వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు కనీస వేతనం 34శాతం, లెవల్ 2 వారికి 52శాతం, లెవల్ 3 ఉద్యోగులకు 70శాతం, లెవల్ 4 ఉద్యోగులకు 88శాతం మేర పెంచాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలతో హెచ్-1బీ వీసాదారుల సగటు వార్షిక వేతనం 14వేల డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఉద్యోగులను నియమించే కంపెనీలు ఏటా 6.56 బిలియన్ డాలర్ల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. H-1B ఉద్యోగులు కీలకమైన నైపుణ్య లోపాలను భర్తీ చేస్తారని, మార్కెట్‌కు పోటీగా ఉండే వేతనాలను పొందుతారని వ్యాపార సంస్థలు వాదిస్తుండగా, ఔట్‌సోర్సింగ్, స్టాఫింగ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని, మార్కెట్ ధరల కంటే తక్కువ వేతనాలకు ఎంట్రీ లెవెల్ లేదా మధ్య స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సందర్భాలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..