పెట్రోల్ బంకుల్లో ఇవన్నీ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టనక్కనర్లేదు..
Venkatrao Lella
Images: Pinterest
31 OCT 2026
పెట్రోల్ బంకులకు వెళ్లినప్పుడు చాలామంది తమ వాహనంలో ఇంధనం నింపుకొని వెళ్లిపోతుంటారు. అయితే పెట్రోల్ బంకుల్లో 7 రకాల ఉచిత సేవలు పొందవచ్చు. ఈ విషయాలు చాలామందికి తెలియవు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకులో కొన్ని ప్రాథమిక సౌకర్యాలను ఉచితంగా అందించాలి. ఈ సేవలు వినియోగదారులకు అత్యవసర సమయాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో చూద్దాం.
స్వచ్ఛమైన తాగునీరు: ప్రతి పెట్రోల్ బంకులో స్వచ్ఛమైన తాగునీరు వాహనదారులకు ఉచితంగా అందించాలి. డీలర్ స్వయంగా ఆర్ఓ యంత్రం లేదా వాటర్ కనెక్షన్ ఏర్పాటు చేయాలి. వాహనదారులకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలి.
శుభ్రమైన వాష్ రూమ్స్: అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారుల కోసం శుభ్రమైన వాష్ రూమ్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. వీటిని బంక్ యాజమాన్యం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
ఫ్రీ కాల్ సదుపాయం: అత్యవసర పరిస్థితులలో ఫోన్ను వినియోగించుకునే సదుపాయం పెట్రోల్ బంకుల్లో ఉండాలి. ఏదైనా సమస్యలో చిక్కుకుంటే.. మీ వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే దగ్గరలోని పెట్రోల్ బంకును సందర్శించడం ద్వారా కాల్ చేసుకోవచ్చు.
టైర్లలో ఉచిత గాలి: పెట్రోల్ బంకుల్లో టైర్లలో గాలి నింపడానికి, గాలి శాతం తనిఖీ చేయడానికి ఖచ్చితంగా యంత్రం అందుబాటులో ఉండాలి. ఉచితంగా గాలి నింపేందుకు సిబ్బంది కూడా ఉండాలి.
కంప్లైంట్ బాక్స్: పెట్రోల్ బంకుల్లో అందించే సేవలు, ఇంధన నాణ్యత లేదా సిబ్బంది ప్రవర్తన పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఒక ఫిర్యాదుల బాక్స్ అందుబాటులో ఉండాలి. ఈఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంధన నాణ్యత తనిఖీ: మీరు కొనుగోలు చేసే పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యత పట్ల అనుమానం కలిగితే.. అక్కడే తనిఖీ చేసుకునే సదుపాయం ఉండాలి. ఇందుకు పరికరాలు, ఫిల్టర్ కాగితాలను బంక్ సిబ్బందే అందించాలి.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్: పెట్రోల్ బంకుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచాలి. వాహనదారులు గాయపడినప్పుడు ప్రాధమిక చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది. దీనిని ఖచ్చితంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.