Alexei Navalny: జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్య బృందం తెలిపింది. ఆయన ఏ క్షణమైనా మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలెక్సీ మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన శరీరంలో పొటాషియం స్థాయిలు పూర్తిగా తగ్గిపోయాయని.. ఇది ఎప్పుడైనా గుండె పోటుకు దారి తీయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాలన్నింటినీ ఆయన వ్యక్తిగత వైద్యుడు యూరోస్లోవ్ అశిఖ్‌మిన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
అలెక్సీ నావల్నీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాడు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో అలెక్సీ దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనపై 2020 ఆగస్టులో విష ప్రయోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సైబీరియా నుంచి మాస్కోకి తిరిగివస్తున్న సమయంలో విమానంలో బాత్రూంకి వెళ్లిన నావల్నీ అపస్మారకస్థితిలో కింద పడిపోయారు. దీంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. నావల్నీ బోర్డింగ్ సమయంలో ఎయిర్ పోర్టులో టీ తాగారని.. ఆ టీలోనే విషం కలిపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుమారుగా 5 నెలలపాటు అలెక్సీ జర్మనీలో చికిత్స పొందారు. ఆరోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి రష్యాకు చేరుకున్న అలెక్సీ.. పుతిన్‌పై పోరాటం ఆపేది లేదని ఎలుగెత్తి చాటారు. దీంతో ఆయనను రష్యా పోలీసులు జనవరి 17 అరెస్ట్ చేశారు. అవినీతి కేసుల పేరుతో ఆయనకు రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్ననావల్నీ తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, చికిత్స అందజేయడానికి తన వైద్య బృందాన్ని పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఇదిలా ఉంటే నావల్నీని విడుదల చేయాలని కోరుతూ రష్యాలోని ప్రధాన నగరాలలో ఆయన మద్దతు దారులు ఆందోళనలు చేస్తున్నారు.
ఏపీలో కరోనా మరణ మృదంగం.. గడిచిన 24 గంటల్లో 22 మరణాలు.. ఆ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు.!
మా రాష్ట్రానికి 5. 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపండి, ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమత లేఖ