ఆఫ్గన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధికారాన్ని తాలిబన్లకు అప్పగిస్తునట్టు ఆఫ్గన్ ప్రభుత్వం ప్రకటించింది. కాబూల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. అధికార మార్పిడి కోసం చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యింది. రక్తపాతం నివారించడానికి, శాంతియుతంగా తాలిబన్లకు అధికారం అప్పగిస్తామని ఆఫ్గన్ ప్రభుత్వం ప్రకటించింది. తాము దాడుల చేయడం లేదని, శాంతియుతంగానే అధికారాన్ని స్వాధీనం చేసుకుంటునట్టు తాలిబన్లు కూడా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు.
ఇప్పటికే వేలాదిమంది ఆఫ్గన్ పౌరులు దేశం విడిచిపారిపోతున్నారు. తాలిబన్ల పాలన చీకటి రోజులు వాళ్లను వెంటాడుతున్నాయి. మరోవైపు ఆఫ్గన్ అధ్యక్షడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేశారు. దేశం మొత్తం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. దేశ రాజధాని కాబూల్‌లోకి కూడా ప్రవేశించారు తాలిబన్లు. ఇప్పటి వరకు 19 ప్రావిన్సులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆఫ్ఘన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తోంది అమెరికా. ఇప్పటికే ఆఫ్గాన్ ఆర్థికమంత్రి దేశం విడిచి వెళ్లిపోగా.. అమెరికాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ.
కీలక నగరాలన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాత్రి జలాలాబాద్‌ను కూడా ఆక్రమించేశారు. దీంతో తూర్పు ప్రాంతానికి, దేశ రాజధాని కాబుల్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఐతే ఎక్కడా తాలిబన్లను ప్రతిఘటించడం లేదు ఆఫ్గన్ సైన్యం..వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే లొంగిపోతున్నారు. అంతకంతకూ తాలిబన్లు రెచ్చిపోతుండటంతో వారి ఆగడాలు తట్టుకోలేక..భయంతో ఇతర దేశాలకు పారిపోతున్నారు స్థానిక ప్రజలు. అమెరికా, యూకే, భారత్ సహా శరణార్థ వీసా సౌకర్యం కల్పిస్తోన్న దేశాలకు వలస వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితమే దేశంలోని రెండు, మూడో అతిపెద్ద నగరాలైన హెరత్, కాందహార్లను తమ వశం చేసుకున్న తాలిబన్లు..నిన్న నాలుగో అతిపెద్ద నగరమైన మెజర్-ఏ- షరీఫ్‌ను ఆక్రమించారు. దీంతో ఉత్తర ఆఫ్గాన్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లినట్లయింది.
ఆఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో బైడెన్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. బైడెన్ తీరును తప్పుబట్టారు. బైడెన్ వైఫల్యం వల్లే తాలిబన్లు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Suryapet: పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్