
Adolf Hitler’s Toilet Seat In Auction: ప్రపంచాన్ని గడగడలాడించిన అడాల్ఫ్ హిట్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన నియంత పోకడలతో ప్రపంచాన్ని భయపెట్టిన హిట్లర్ చివరికి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఇప్పటికీ ఎవరైనా నియంతలా పాలిస్తుంటే హిట్లర్‌లా ఉంది పాలనా.. అంటూ విమర్శిస్తుంటారు. హిట్లర్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లి.. 76 ఏళ్లు గడుస్తోన్నా అడపాదడపా ఆయన ప్రస్తావన వస్తూనే ఉంటుంది.
ఇదే క్రమంలో హిట్లర్ మరోసారి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళితే.. హిట్లర్ బతుకున్న సమయంలో ఉపయోగించిన టాయిలెట్ సీట్‌ను ప్రస్తుతం వేలానికి ఉంచనున్నారు. దీనికి సంబంధించిన వేలం ఈ నెల 8వ తేదీన అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరగనుంది. ‘అలెగ్జాండర్ ఆక్షన్స్’ అనే సంస్థ ఈ వేలం పాటను నిర్వహించనుంది. దీని ప్రారంభ ధరను 5వేల డాలర్లుగా నిర్ణయించారు. ఇక ఈ టాయిలెట్ సీటు 15000 డాలర్లకు అమ్ముడుపోతుందని సదరు సంస్థ అంచనా వేస్తోంది. అంటే మన కరెన్సీలో రూ.10 లక్షలకుపైమాటే అన్నమాట. హిట్లర్ జర్మనీకి చెందిన వ్యక్తి అయితే.. అతను వాడిన టాయిలెట్ సీట్ అమెరికాకు ఎలా వెళ్లిందని ఆలోచిస్తున్నారా..? అయితే చరిత్రలోకి వెళ్లాల్సిందే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలోని బెర్చ్టేస్ గాడెన్లో ఉన్న హిట్లర్ ప్రైవేట్ బాత్రూమ్లో ఉన్న టాయ్‌లెట్ సీటును అమెరికాకు చెందిన సైనికుడు రాంగ్వాల్డ్ సి బోర్చ్ దొంగతనం చేశాడు. బొవారియన్ రిట్రీస్ సమయంలో హిట్లర్ ఇంటిని సాయుధ దళాలు చుట్టుముట్టగా ఆ సమయంలో అదే అదునుగా అతడు టాయ్‌లెట్ సీట్‌ను ఎత్తుకెళ్లి న్యూజెర్సీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఏళ్లుగా అది అతడి ఇంటి పునాదిలోనే ఉంది. ఇప్పుడు ఆ సీటును ఆ సైనికుడి కుటుంబసభ్యులే వేలానికి పెట్టారు. దీంతో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ టాయిలెట్ సీటు వార్తల్లోకెక్కింది.