‘చేతులతో కోటనే కదిలించారు’… జపాన్‌లో భవనాన్ని జరిపిన 1,800 మంది!

భూకంపం వల్ల దెబ్బతిన్న 396 టన్నుల బరువైన పురాతన 'హిరోసాకి' కోటను యథాస్థానానికి చేర్చేందుకు దాదాపు 1,800 మంది ప్రజలు ఒక్కటయ్యారు. శతాబ్దాల నాటి తమ చారిత్రక సంపదను కాపాడుకునేందుకు విదేశాల నుంచి సైతం తరలివచ్చి ఈ భారీ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు.

చేతులతో కోటనే కదిలించారు... జపాన్‌లో భవనాన్ని జరిపిన 1,800 మంది!
People Move Hirosaki Castle In Japan Using Ancient Hikiya Technique

Updated on: Aug 28, 2026 | 5:19 PM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ 400 ఏళ్ల నాటి అతి పురాతన పద్ధతికే విలువిస్తూ తమ సంస్కృతికి గౌరవం ఇచ్చారు జపాన్ ప్రజలు. 400 ఏళ్ల నాటి పద్ధతిని గౌరవిస్తూనే ఆ సంప్రదాయానికి విలువ ఇవ్వడంలో ముందు ఉన్నారు జపాన్ ప్రజలు.  తాజాగా ఆ దేశంలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భూకంపం వల్ల దెబ్బతిన్న 396 టన్నుల బరువైన పురాతన ‘హిరోసాకి’ కోటను యథాస్థానానికి చేర్చేందుకు దాదాపు 1,800 మంది ప్రజలు ఒక్కటయ్యారు. శతాబ్దాల నాటి తమ చారిత్రక సంపదను కాపాడుకునేందుకు విదేశాల నుంచి సైతం తరలివచ్చి ఈ భారీ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు.

ప్రాచీన ‘హికియా’ సాంకేతికతతో వింత 

ఉత్తర జపాన్‌లో ఉన్న ఈ చారిత్రక కోట పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత, దాన్ని తిరిగి అసలు ప్రదేశానికి జరపాల్సి వచ్చింది. అందుకోసం జపాన్ ప్రాచీన సంప్రదాయ సాంకేతికత అయిన ‘హికియా’ (Hikiya) పద్ధతిని ఉపయోగించారు. భారీ తాళ్ళ సహాయంతో 1,800 మంది ప్రజలే ఒక్కసారిగా బలాన్ని ప్రయోగించి, కోటను 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెనక్కి జరిపి తమ నైపుణ్యాన్ని చాటారు. భవనాన్ని మరమ్మత్తుల కోసం కూల్చకుండా రోలర్లపై ఉంచి ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చే ప్రాచీన జపాన్ పద్ధతినే ‘హికియా’ అంటారు.

‘సో-రే, సో-రే’ నినాదాలతో కదిలిన కోట

ప్రస్తుతం ఈ భారీ కోటను తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు 80 మందితో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. 30 మీటర్ల పొడవైన తాళ్లను చేతులతో పట్టుకుని, ఉత్సాహంగా ‘సో-రే, సో-రే’ అంటూ నినాదాలు చేస్తూ కోటను ముందుకు లాగారు. ఆగస్ట్ నెల ఆఖరుకి దాదాపు 4,100 మంది ప్రజలు భాగస్వాములై కోటను 5 మీటర్ల మేర తరలిస్తారు. మిగిలిన 73 మీటర్ల తరలింపు ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి ఆధునిక యంత్రాల సహాయంతో పూర్తి చేయనున్నారు.

ఈ అరుదైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రపంచ నలుమూలల నుంచి జనం పోటీ పడ్డారు. దీనిపై హిరోసాకి నగర పార్కులు, పచ్చదనం విభాగాధిపతి కెన్సుకే హయాసాకా మాట్లాడుతూ,  “ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,800 ఖాళీలు మాత్రమే ఉండగా, గత రెండు రోజుల్లో ఏకంగా 8,000 దరఖాస్తులు వచ్చాయి. అనుకున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ స్పందన రావడంతో అందరికీ అవకాశం కల్పించలేకపోయాం. జపాన్ ప్రజలతో పాటు ఆగ్నేయాసియా, యూరప్, ఉత్తర అమెరికా దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఇందులో పాల్గొన్నారు” అని వెల్లడించారు.

ఆధునిక క్రేన్లు, భారీ యంత్రాలు ఉపయోగించకుండా కేవలం ప్రాచీన ‘హికియా’ పద్ధతిలో ప్రజల భాగస్వామ్యంతో శతాబ్దాల నాటి కోటను సురక్షితంగా జరపడం జపాన్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరోసారి అద్దం పడుతోంది.


400 ఏళ్ల హిరోసాకి కోట ప్రత్యేకతలు

1611లో ‘సుగారు’ వంశస్తులు ఈ కోటను నిర్మించారు. 1627లో పిడుగుపాటుకు గురై దెబ్బతినగా, 1810లో తిరిగి పునర్నిర్మించారు. జపాన్‌లో నేటికీ చెక్కుచెదరకుండా మిగిలి ఉన్న 12 పురాతన కోట బురుజులలో ఇది ఒకటి. వసంతకాలంలో పూలు వికసించే ‘చెర్రీ బ్లాసమ్’ సమయంలో ఈ కోట సౌందర్యాన్ని తిలకించేందుకు ఏడాదికి దాదాపు 20 లక్షల మంది విదేశీ పర్యాటకులు తరలివస్తుంటారు.

 


Loading...
Unable to load recommendations.
Follow Us