శ్రీవారి భక్తులకు అలెర్ట్‌..ఆ సేవలు బంద్! వీడియో

Updated on: Jan 25, 2025 | 1:11 PM

వచ్చే నెల 4న తిరుమలలో జరగనున్న శ్రీవారి రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. కొద్దిరోజుల క్రితం వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో అపశృతి చోటుచేసుకోవడంతో రథసప్తమికి టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే.. రథసప్తమి ఏర్పాట్ల పై మాడవీధుల్లో జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు, భద్రత ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతపరంగా కలెక్టర్, ఎస్పీలతో చర్చించి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక.. రథసప్తమి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించబోమని.. కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందన్నారు ఈవో శ్యామలరావు.తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలకు గతంలో కంటే పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్థన్‌రాజు. గతంలో ఎక్కడెక్కడ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు పలు సూచనలు చేశారు.