రికార్డు స్థాయిలో వేడెక్కిన సముద్రాలు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా
వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతూ మహాసముద్రాలు 2025లో రికార్డు స్థాయిలో వేడెక్కాయి. ఆధునిక పద్ధతుల్లో రికార్డులను నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధికమని శుక్రవారం విడుదలైన ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ‘అడ్వాన్సెస్ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదిక, సముద్ర గర్భంలో పెరిగిన ఉష్ణం పెను ప్రమాదాలకు సంకేతమని హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా 31 పరిశోధనా సంస్థలకు చెందిన 50 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వారి విశ్లేషణ ప్రకారం గతేడాది సముద్రాలు గ్రహించిన ఉష్ణం ఏకంగా 23 జెట్టా జౌల్స్‌గా నమోదైంది. ఇది 37 ఏళ్ల పాటు ప్రపంచం వినియోగించిన విద్యుచ్ఛక్తితో సమానం. సముద్ర ఉపరితలం నుంచి 2,000 మీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయని పరిశోధకులు నిర్ధారించారు. ముఖ్యంగా అట్లాంటిక్, నార్త్ పసిఫిక్, దక్షిణ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ వేడి అత్యంత వేగంగా పెరిగింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 2025లో అత్యధికంగా నమోదైంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సముద్రపు నీరు ఎక్కువగా ఆవిరై, వాతావరణంలో తేమ పెరగడానికి ఇది కారణమవుతోంది. దీని ఫలితంగా ఆగ్నేయాసియా, మెక్సికోలలో భారీ వరదలు, మధ్యప్రాచ్యంలో తీవ్ర కరవు వంటి ప్రకృతి వైపరీత్యాలు తప్పలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్రాలు ఇలా వేడెక్కడం వల్ల నీరు వ్యాకోచించి సముద్ర మట్టాలు పెరుగుతాయని, తుఫానులు మరింత బలపడతాయని వారు హెచ్చరించారు. భూమిపై వేడి తగ్గేంత వరకు సముద్ర ఉష్ణోగ్రతలు ఇలాగే రికార్డులు సృష్టిస్తూనే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
