పాములకు ఇవంటే చచ్చేంత భయం
వర్షాకాలం వస్తే పాముల బెడద సర్వసాధారణం. అయితే, పాములు కొన్ని వాసనలకు, శబ్దాలకు, వాటి సహజ శత్రువులకు భయపడతాయని మీకు తెలుసా? ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మీ ఇంటిని, పరిసరాలను పాముల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. వర్షాకాలంలో పాము కాట్ల నుంచి తప్పించుకోవచ్చు. పాములు కొన్ని రకాల ఘాటైన వాసనలను అస్సలు ఇష్టపడవు.
నీటిలో వేప నూనె కలిపి ఇంటి చుట్టూ, ప్రవేశ ద్వారాల వద్ద స్ప్రే చేస్తే పాములు దూరంగా ఉంటాయి. నిలిచి ఉన్న నీటిపై లేదా పాములు ఉండే కలుగుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వల్ల అవి రాకుండా ఉంటాయి. అలాగే దాల్చిన చెక్క పొడి, వెనిగర్, నిమ్మరసం: వీటిని కలిపి స్ప్రే చేయడం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయల్లోని సల్ఫోనిక్ యాసిడ్ పాములకు నచ్చదు. కిటికీలు, తలుపులకు రుద్దడం లేదా ఇంటి తోటలో ఈ మొక్కలను నాటడం మంచిది. లవంగం, దాల్చిన చెక్క నూనెలను కలిపి స్ప్రే చేయడం ద్వారా పాములను తరిమివేయవచ్చంటున్నారు నిపుణులు. అమ్మోనియా వాసన పాములకు పడదు. అమ్మోనియాలో ముంచిన గుడ్డలను పాములు వచ్చే ప్రదేశాల్లో ఉంచవచ్చు. కొన్ని మొక్కల వాసనలు కూడా పాములను దరిచేరనీయవు. కాక్టస్ అంటే ముళ్ళతో ఉండే మొక్కలు, స్నేక్ ప్లాంట్, తులసి, నిమ్మ గడ్డి, బంతి పువ్వులు, నాగుదంతి, లావెండర్, మింట్, యూకలిప్టస్, రోజ్మేరీ, ఫెన్నెల్, గెరానియం వంటి మొక్కలు పాములను దూరం చేయడంలో సహాయపడతాయి. పాములకు కొన్ని సహజ శత్రువులుంటాయి. ముంగిస పాముకు ప్రధాన శత్రువు. ముంగిస ఎదురైతే పాము తప్పించుకోవడానికి చూస్తుంది. కుక్కలు, పిల్లులు ఉన్న ప్రదేశాలలోనూ పాములు ఉండటానికి ఇష్టపడవు. గుడ్లగూబలు, మరికొన్ని పక్షులు కూడా పాములను వేటాడుతాయి. పాములకు చెవులు లేకపోయినా, అవి భూమిలోని ప్రకంపనలను, గాలిలోని కొన్ని రకాల ధ్వని తరంగాలను గ్రహించగలవు. పెద్ద శబ్దాలు లేదా ప్రకంపనలు వాటిని కలవరపెడతాయి. అలాగే, పాములు సాధారణంగా మానవుల ఉనికిని గుర్తించి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి. మనం ప్రశాంతంగా ఉంటే అవి దాడి చేయకుండా వెళ్లిపోతాయి. ముఖ్యంగా, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కట్టెల కుప్పలు, రాళ్ల గుట్టలు, చెత్త, కలుపు మొక్కలు, పుట్టలు, రంధ్రాలు వంటి పాములు దాక్కునే ప్రదేశాలు లేకుంటే అవి మన దగ్గరకు రావు. వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకదానికొకటి ఎదురుపడిన రెండు కింగ్ కోబ్రాలు.. ఆ తర్వాత
కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?