జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే

Updated on: Jan 19, 2026 | 7:58 PM

మెదక్ జిల్లాలో జీపీఎస్ ట్రాకర్లతో ఉన్న రాబందు సంచారం కలకలం రేపింది. గ్రామస్థులు ఆందోళన చెందగా, అటవీ శాఖ అధికారులు స్పందించారు. అంతరించిపోతున్న రాబందుల కదలికలను తెలుసుకోవడానికి, వాటిని రక్షించడానికి ఈ ట్రాకర్లు అమర్చామని వివరించారు. వ్యాధుల నివారణలో కీలకమైన రాబందుల సంరక్షణకు ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్.

మెదక్ జిల్లాలో ట్రాకర్ రాబందు సంచారం కలకలం రేపింది. అల్లాదుర్గం మండలం బహిరాన్ దిబ్బ శివారులో జీపీఎస్ ట్రాకర్లు ఉన్న రాబందు ప్రత్యక్షమవడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. రాబందు కాళ్లకు నంబర్లతో కూడిన స్టిక్కర్లు ఉండటాన్ని స్థానికులు గమనించారు. అయితే, అంతరించిపోతున్న రాబందుల కదలికలను గమనించేందుకు తామే జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. వేల ఏళ్లుగా.. చనిపోయిన పశువుల కళేబరాలు తింటూ.. ప్రమాదకరమైన అంటువ్యాధుల నుంచి మానవాళిని కాపాడుతున్న రాబందులు వేగంగా అంతరించిపోతుండటంతో అటవీశాఖ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో అంతరించిపోతున్న ఈ పక్షిజాతిని కాపాడేందుకు చాలా చోట్ల అత్యాధునిక జీపీఎస్ ట్రాకర్లను రాబందులకు అమర్చుతున్నారు. వీటిని అమర్చడం వల్ల అసలు ఈ రాబందులు ఎక్కడికి వలస వెళ్తున్నాయి? ఏ ప్రాంతాల్లో ఆహారం తీసుకుంటున్నాయి.. వాటి మనుగడకు ఎక్కడ ముప్పు పొంచి ఉంది..వంటి విషయాలను తెలుసుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్ నుండి విడుదల చేసిన ఒక రాబందు GPS సాయంతో ట్రాక్ చేయగా,అది ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు దాదాపు 4,000 కి.మీ ప్రయాణించినట్లు గుర్తించారు అధికారులు. ఒకవేళ ఏదైనా ప్రాంతంలో రాబందులు కదలకుండా ఒకే చోట ఉంటే, GPS డేటా ద్వారా అధికారులు వెంటనే స్పందించి కారణాలను విశ్లేషిస్తారు. ఈ ట్రాకర్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రాబందులకు సేఫ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. పక్షుల కదలికలను శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. ప్రకృతి సమతుల్యతలో కీలకమైన రాబందులను కాపాడుకోవడంలో ఈ ‘GPS ట్రాకర్లు’ గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి అంటున్నారు అధికారులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి

పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్‌!

చెన్నైలో ఎన్టీఆర్ నివాసం.. త్వరలో అభిమానులందరికీ ప్రవేశం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా !!

యాదాద్రి జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పెట్లో జనం